దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అల్లరి ప్రేమికుడు సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. జగపతి బాబు ఈ సినిమాలో హీరోగా నటించారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోగా కమల్ హాసన్ ఎంపిక కాగా మీనా, దివ్యభారతి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న రాఘవేంద్రరావు దివ్యభారతి ఆకస్మిక మరణంతో అల్లరి ప్రేమికుడు నటీనటుల విషయంలో మార్పులు చేశారు.
మీనా డేట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో కథలో మార్పులు చేసిన రాఘవేంద్రరావు సౌందర్య, రంభ, కాంచన్ లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. లేడీస్ లో కమల్ కంటే జగపతిబాబుకు బాగా ఫాలోయింగ్ ఉండటంతో ఆ కథకు జగపతిబాబును రాఘవేంద్ర రావు ఎంపిక చేశారు. దాసరి నారాయణరావు ఈ సినిమాకు తొలి క్లాప్ కొట్టారు. 1993 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సౌందర్య ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ గెస్ట్ రోల్ లో నటించారు. 1994 సంవత్సరం మే నెల 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. జగపతి బాబుకు లేడీస్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కథ, కథనంలోని లోపాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. వరుస హిట్ల తరువాత రాఘవేంద్రరావుకు ఈ సినిమాతో ఫ్లాప్ ఖాతాలో చేరింది.