రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఓ సినిమా.. రూ. 250 కోట్లు వసూలు చేసింది అంటే.. అది ఎంతటి పెద్ద విజయమో ఈజీగా అర్థమైపోతుంది. ఆ సినిమానే మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). స్టార్ కాస్టింగ్ లేదు, పెద్ద పెద్ద సెట్స్ వేయలేదు.. కానీ సినిమా అదిరిపోయే విజయం అందుకుంది. 2006లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెరకెక్కించారు దర్శకుడు చిందబరం ఎస్ పొదువల్(Chidambaram S. Poduval).
మలయాళ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కిన ఈ సినిమా గురించి, అందులో కీలకంగా నిలిచిన గుణ గుహ సెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. సుమారు 900 అడుగులు లోతున్న ‘గుణ’ గుహలోనే సినిమాను షూట్ చేశారా అన్నట్లుగా భలేగా చూపించారు. గుణ గుహల్లోనే నిజంగా షూట్ చేశారా అని కొంతమంది అనుకున్నారు కూడా. అంతలా మెప్పించిన ఆ వర్క్ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అజయన్ చలిస్సేరి నుండది వచ్చింది.
పెరుంబవూరులోని ఓ పాత గోడౌన్‌లో ఈ గుహ సెట్ వేశారట. కొడైకెనాల్‌లో ఉన్న ‘గుణ’ గుహ నిషేధిత ప్రాంతం, ఆ గుహను చూపించడానికి కూడా అటవీ శాఖ వెనుకాడిందట. ఆఖరికి చాలా కండీషన్లతో ఓకే చెప్పి గుణ గుహను చూపించారట. సినిమాలో చూపించినట్లుగానే ఆ గుహ ఉందట. గుహలో 80 అడుగుల కిందకు వెళ్లినప్పుడు ఫొటోలను తీసుకున్నార టీమ్. అలా వాటి ఆధారంగానే సెట్ రూపొందించారట.
సినిమా కోసం 17 అడుగుల లోతు తవ్వాల్సి వచ్చిందట. ఏ స్టూడియోలోనూ అవకాశం ఉండదని అర్థమయ్యాక.. పెరుంబవూరులోని ఓ గోడౌన్ లో ఈ సినిమా సెట్ వేశారట. సెట్ నిర్మించడానికి 3 నెలలు పట్టిందట. గుహలో రాళ్ల కోసం ఫైబర్ వాడారట. ఆ సెట్ చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయారని, అజయ్ చెప్పారు. నిజమే మరి.. నిజంగా గుణ గుహలో షూట్ చేసినట్లే ఉంటుంది సినిమా.