నందమూరి బాలకృష్ణ అవుట్ అండ్ అవుట్ తెలంగాణ మ్యాన్‌గా చూపించబోతున్నారు అనిల్ రావిపూడి. నేలకొండ భగవంత్ కేసరిగా ఆయన ఈ దసరాకు థియేటర్లలోకి రాబోతున్నారు. ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్‌ను టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది కూడా. అయితే ఇప్పుడు మరో విషయంలో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అదే ఈ సినిమా కథ. అవును ఈ సినిమా స్టోరీకి ఓ బాలీవుడ్ హిట్ సినిమాకు సంబంధం ఉంది అని చెబుతున్నారు.
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’తో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా దాదాపు ఇంతే. ఈ సినిమాలో బాలయ్య కాస్త ఓల్డ్ ఏజ్ లుక్‌లో కనిపిస్తారు అని ఇప్పటికే చెప్పేశారు. ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది అని కూడా చెప్పేశారు. భగవంత్ కేసరి కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్తాడని, శిక్ష పూర్తయ్యాక బయటకు వస్తే ఏం జరిగింది అనేది కథ అని అంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య, శ్రీలీల తండ్రీకూతుళ్లుగా కనిపిస్తారట.
ఈ మొత్తం విన్నాక ఈ సినిమా కథకు, ఓ బాలీవుడ్ సినిమాకు దగ్గర సంబంధం ఉంది అని అంటున్నారు. 1992లో బాలీవుడ్‌లో వచ్చిన ‘ఖుదా గవా’ సినిమాకు ‘భగవంత్ కేసరి’కి పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ సినిమాలో ప్రేయసికి ఇచ్చిన మాట కోసం శత్రువుని చంపిన అమితాబ్ బచ్చన్ మరో ప్రాణ స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతనెవరో తెలియకుండానే కూతురు ఇంకో చోట పెరిగి పెద్దవుతుంది. బయటికొచ్చాక ఆమెను కాపాడటం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు హీరో.
ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) టీమ్ సమాచారం కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ‘ఎఫ్ 3’ సినిమా కాన్సెప్ట్ కూడా బాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉందనే విమర్శలు వచ్చాయి. గ్రూప్, పెద్ద ఇల్లు, డబ్బు కోసం ఆశ.. అనే కాన్సెప్ట్‌లు ఓ బాలీవుడ్ హిట్ సిరీస్‌లో ఉంటాయి. దీంతో ఆ ఆలోచనతో ‘ఎఫ్ 3’ తీశారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ‘భగవంత్ కేసరి’తో అలాంటి మాటలే వచ్చే అవకాశం ఉంది.