బాగా ఓపికగా ఉన్నోడిని ఇంకాస్త ఇరిటేట్ చూద్దాం అనుకుంటూ ఉంటారు కొందరు. మీ నిజ జీవితంలో కూడా ఇలాంటివాళ్లను చూసుంటారు. అయితే లైవ్‌లో చూడాలి అనుకుంటే ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్ పేజీలో చూడొచ్చు. అందులో రిప్లైస్‌లోకి వళ్తే.. హరీశ్ శంకర్‌ను ఇరిటేట్ చేస్తూ కొన్ని కామెంట్స్ కనిపిస్తాయి. వాటికి హరీశ్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లైలు కూడా కనిపిస్తాయి. ఇంతకీ ఏమైందంటే? ట్విటర్‌లో సెలబ్రిటీలకు ఫేక్ అకౌంట్‌లు ఉన్నాయి అంటుంటారు.
అయితే వాటిని సూడో అకౌంట్‌లు అని చెబుతుంటారు అనుకోండి. అయితే రెగ్యులర్ ట్విటర్ అకౌంట్‌లో ఒకలా మాట్లాడితే, మరో అకౌంట్‌తో జస్ట్ అలా సోషల్ మీడియా ట్రెండ్స్‌ను చూస్తుంటారు అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని గతంలో కొంతమంది సెలబ్రిటీలు అన్యాపదేశంగా చెప్పేశారు కూడా. అయితే సూడో అకౌంట్ / ఫేక్ అకౌంట్‌తో తిడతారా? ఏమో హరీశ్ శంకర్‌ను ఇలానే ఒకరు అడిగారు. దానికి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేశారు.
హరీశ్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయనకు సినిమా అప్‌డేట్ల గురించి ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. అయితే ఈ క్రమంలో సినిమా 50 శాతం పూర్తయిందని, నాణ్యత విషయంలో దేవుడి మీద భారం అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే హరీశ్ శంకర్ కౌంటర్ ఇచ్చి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో మరో నెటిజన్ ఇంకో ట్వీట్ చేశారు.
హరిష్ శంకర్‌కు ట్విటర్‌లో ఓ ఫేక్ అకౌంట్ ఉందని, ఆ అకౌంట్‌లో మొత్తంగా బూతులే కనిపిస్తున్నాయని ఓ ట్విటర్ పేజీలో ట్వీట్ కనిపించింది. దానికి హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘నేను ఎవరికీ భయపడను. అనాలనుకున్నప్పుడు నా అకౌంట్ లోనే పోస్ట్ చేస్తా, ఇంకో అకౌంట్ నాకు అక్కర్లేదు. దయచేసి ఇలాంటి అర్థం లేని మాటలు ఆపేయండి. ఇలాంటి విషయాల్లో మీ సపోర్టు నాకు అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు.