నాగార్జున నుండి ఈ సంక్రాంతికి ఓ రీమేక్ సినిమా వస్తోంది తెలుసు కదా. ఏంటీ రీమేకా? వస్తోంది ‘నా సామి రంగా’ కదా అంటారా? అవును వస్తోంది ఆ సినిమానే అయితే… ఇక్కడ చాలామంది మరచిపోయిన విషయం ఏంటంటే ఆ సినిమా ఓ మలయాళ బొమ్మకు రీమేక్. సినిమా స్టార్ట్ కాక ముందు ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినా… ఇప్పుడు అదేదో రెగ్యులర్ సినిమాలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు మరో చర్చ నడుస్తోంది.
అదే సాడ్ క్లైమాక్స్ ఉన్న కథను ఎంచుకుని నాగార్జున రిస్క్ చేస్తున్నారా? అని. నిజానికి నాగ్ ‘నా సామి రంగా’ సినిమా చేస్తున్నాడని తెలిసిన తొలి రోజుల్లో ఆ ఒరిజనల్ సంగతేంటి అని చాలామంది ఆసక్తిపరులు చూసేశారు. అందులో కథ, కథనం చూస్తే మన ఇండస్ట్రీకి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ పూర్తి సాడ్‌గా ఉంటుంది. ఏం జరిగినా, ఏం చేసినా ఆఖరున మన టాలీవుడ్ హీరో చాలా హీరోయిక్‌గా కనిపించాలి.
కానీ ఆ మాతృక సినిమా క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడు. అతనితోపాటు మరో మెయిన్ లీడ్ పాత్ర కూడా చనిపోతుంది. మరి ఇలాంటి పాత్రలను మన వాళ్లు ఆదరిస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. గతంలో నాగార్జున ఇలా ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాలో సాడ్ ఎండింగ్‌తో ఉన్న కథలో నటించారు. ఆ సినిమాకు బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితం వచ్చింది. దీంతో ఇప్పుడు అలాంటి ఫలితం రాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.
దానికి తోడు టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వస్తున్న రీమేక్‌లకు అస్సలు కలసి రావడం లేదు. ఎవరు చేసినా పరాజయమే పలకరిస్తోంది. దీంతో ఈ రిస్క్ అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అన్నట్లు ఇన్ని విషయాలు చెప్పాం, ఆ మాతృక సినిమా పేరు చెప్పలేదు కదా. మూడున్నరేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ‘పొరింజు మరియం జోస్’కు ఈ సినిమాకే రీమేక్. అయితే రీమేక్ సందర్భంగా కొన్ని కీలక మార్పులు చేశారట. అవేంటో తెలియాలంటే ఈ నెల 14 రావాల్సిందే.