సినిమాల్లో ప్రధాన పాత్రధారులకు ఏదో ఒక అంగవైకల్యం ఉంటే ఆ సినిమాలు విజయాలు.. ఇంకా చెప్పాలంటే భారీ విజయాలు అందుకుంటాయని ఇండస్ట్రీలో ఓ మాట ఉంది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. చాలా సినిమాలు అయితే అలా విజయం సాధించాయి కూడా. అయితే ఇక్కడో విషయం.. ఆ సినిమాల్లో హీరోల నటన మరో లెవల్‌లో ఉంటుంది అని మాత్రం చెప్పాలి. ఇప్పుడు మరోసారి దర్శకుడు శంకర్ (Shankar) అదే పని చేశారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
Ram Charan
శంకర్ అని అన్నాం కాబట్టి ఆ సినిమా ‘గేమ్ ఛేంజర్’ అని ఈజీగా చెప్పేస్తారు. అవును ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) లో చరణ్ (Ram Charan) పాత్రకు చిన్న ఇబ్బంది ఉంటుందట. అంతేకాదు ఆ సమస్య వల్ల సినిమాలో కీలక మలుపు కూడా ఉంటుంది అని చెబుతున్నారు. ఆ సమస్యే నత్తి అని చెబుతున్నారు. స్టార్ హీరోల పాత్రలకు లోపం పెట్టి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఒప్పించడం కష్టం. అయితే ఇటీవల కాలంలో మన దర్శకులు ఈ పని చేసి విజయం సాధిస్తున్నారు.
రామ్‌చరణ్ కూడా గతంలో ఈ పని చేశారు. ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలో చరణ్‌ను సుకుమార్ చెవిటి వానిగా చూపించారు. ఈ క్రమంలో చరణ్ నుండి కెరీర్ బెస్ట్ పర్‌ఫార్మెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మరోసారి ‘గేమ్ ఛేంజర్’లో అలాంటి నటనే వస్తుందని ఆశిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఒకటి రాజకీయ నాయకుడు అప్పన్న అయితే.. రెండోది ఐపీఎస్ అధికారి రామ్ నందన్.
అప్పన్న పాత్రకు నత్తి ఉంటుందట. కీలక సమయంలో మాట్లాడలేకపోవడంతో.. సినిమా మొత్తం మారిపోతుందట. ఆ తర్వాత మొత్తం పరిస్థితి ఎమోషనల్‌గా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సంగతేంటో తేలాలి అంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. ఆరోజే ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలోకి రాబోతోంది. ముందే ఈ విషయంలో క్లారిటీ కావాలి అంటే సినిమా ప్రచారం షురూ అయితే టీమ్‌ని అడిగి చూడాలి.