హీరో ఎంత మాస్‌గా ఉంటే… ఫ్యాన్స్‌కి అంత ఎక్కువ కిక్ వస్తుంది అంటారు. దీని కోసం కొంతమంది దర్శకులు పూర్తి మాస్ కథ రాసుకుంటే… మరికొంతమంది పోలీసు కథలను సిద్ధం చేస్తుంటారు. ఇంకొందరు అయితే తమ హీరోకు విలనీ టచ్ ఇస్తారు. ఎలివేషన్లు, మాస్ అంశాలు అప్పుడు ఇంకాస్త బలంగా రాసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలో ఇలాంటివి కాస్త ఎక్కువగానే చూస్తున్నాం. అయితే ఇలా చూపించడం అనేది కత్తి మీద సామే అనొచ్చు. దానికి తాజా ఉదాహరణ ‘టైగర్ నాగేశ్వరరావు’.
రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో హీరో గజ దొంగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊర మాస్ పాత్ర కావడంతో రవితేజ చాలా కష్టపడి, మనసు పడి చేశాడు. అయితే పాత్రను మలిచే క్రమంలో, ప్రజలకు చేరువ చేసే క్రమంలో దర్శకుడు విఫలం అయ్యాడు అని చెప్పాలి. అందుకే సినిమాకు జనాలు కనెక్ట్ కాలేదు. అలాగే థియేటర్లకు రావడమూ లేదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
టైగర్ నాగేశ్వరరావును రాబిన్ వుడ్ తరహా దొంగ అనొచ్చు. అలా అతనొక హీరోనే. దర్శకుడు వంశీ కూడా ఆ పాత్రని హీరోలానే చూపించాలనుకున్నారు. కానీ తెర మీదకు అలా రాలేదు. నెగిటివిటీ బయటకు ఎక్కువగా కనిపించే సరికి జనాలు కనెక్ట్ అవ్వలేదు. కొన్ని సన్నివేశాలు హీరోయిజాన్ని చూపించబోయి… వెగటును, చిరాకును చూపించాయి అని చెప్పొచ్చు. అంతెందుకు రవితేజ గత చిత్రం ‘రావణాసుర’ విషయంలోనూ ఇదే ఇబ్బంది వచ్చింది.
హీరో పాత్ర జనాలకు ఏమాత్రం దగ్గరగా కనిపించలేదు. అంతా చేసి ఆఖరకు మంచోడు అని చెప్పే ప్రయత్నం జరిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇలా ఇటీవల కాలంలో చూపించి సక్సెస్ అయిన సినిమాలు అంటే ‘కేజీయఫ్’, ‘పుష్ప’ అని చెప్పాలి. ఆ సినిమాల్లో హీరోయిజం కాస్త విలనీ/ నెగిటివ్ ఛాయలో ఉంటుంది. కానీ సగటు మనుషుల్లా ఆ పాత్ర కనిపిస్తుంది. దీంతో హీరోను విలన్‌గా చూపించడం అందరికీ సాధ్యం కాదు అనే కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.