“నాన్నకు ప్రేమతో” లాంటి స్టైలిష్ హిట్ తర్వాత ఎన్టీయార్. “శ్రీమంతుడు” లాంటి మోడరేట్ హిట్ తర్వాత కొరటాల శివల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “జనతా గ్యారేజ్”. సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంపై ఎన్టీయార్ అభిమానుల్లోనే కాక.. సగటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకొన్న ఈ చిత్రం వారిని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : ఓ మారుమూల గ్రామం నుంచి హైద్రాబాద్ వలస వచ్చిన వ్యక్తి సత్యం (మోహన్ లాల్). తన తమ్ముడితో కలిసి “జనతా గ్యారేజ్” అనే మెకానిక్ షెడ్ ను మొదలెడతారు. అయితే.. ఆ షెడ్ కు వచ్చిన బైకులు, కార్లు మాత్రమే కాక మనుషుల కష్టాలను కూడా రిపేర్ చేస్తుంటారు. ఆ క్రమంలో ఆనంద్ (ఎన్టీయార్) తల్లిదండ్రులు చనిపోతారు. దాంతో.. ఆనంద్ ను అతని మావయ్య (సురేష్) బాంబే తీసుకెళ్లి “జనతా గ్యారేజ్” గురించి ఏమాత్రం తెలియకుండా పెంచుతాడు.
కట్ చేస్తే.. ఆనంద్ తన పెద్ద నాన్న బుద్ధులు పుణికిపుచ్చుకుంటాడు. మనిషికి మాత్రమే కాదు చెట్టుకి కూడా విలువనిస్తూ పెరుగుతాడు. ఒకానొక సందర్భంలో తనకు తెలియకుండానే పెద్ద నాన్నని కలిసి ఆయన మార్గం అనుసరిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. సత్యం మార్గంలోకి వచ్చిన ఆనంద్ ఎదుర్కొన్న అవరోధాలేంటి? అతడి పయనం ఎటువైపుకి సాగింది? అనేది క్లుప్తంగా “జనతా గ్యారేజ్” కథాంశం.
నటీనటుల పనితీరు : ఆనంద్ అనే నేఛర్ లవర్ గా ఎన్టీయార్ చక్కగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ కళ్ళలో అతడు పలికించిన హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కాకపోతే కొన్ని ఇంటెన్స్ సీన్స్ లోనూ కేవలం కళ్ళతోనే నటించాలని చేసిన ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. కాస్త బరువు కూడా పెరిగాడేమో డ్యాన్స్ మూమెంట్స్ లో ఇంతకుముందున్న రిధమ్ కనపడలేదు. మోహన్ లాల్ ను “కంప్లీట్ యాక్టర్” అని ఎందుకు అంటారో ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు కూడా అర్ధమవుతుంది. సన్నివేశానికి ఎంత అవసరమే అంతే స్థాయిలో ఆయన కనబరిచిన నటన, ఎమోషనల్ సీన్స్ లో పలికించిన హావభావాలకు సగటు ప్రేక్షకుడు ఫిదా అయిపోవాల్సిందే.
సమంత, నిత్యామీనన్ లను హీరోయిన్లుగా కంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవడం చాలా బెటర్. ఆస్తి పంపకాల్లా ఇద్దరికీ చెరో అయిదు సీన్లు పంచేశాడు డైరెక్టర్. అందువల్ల కథలో వారి పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. చిన్న పాత్రే అయినప్పటికీ రాజీవ్ కనకాల నటన సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. అజయ్, బ్రహ్మాజీ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను సినిమా మొత్తం వెనుక నిలబడే బొమ్మలుగా వాడడం బాధాకరం. సినిమా మొత్తానికి బ్రహ్మాజీకి మహా అయితే ఓ రెండు డైలాగులుంటాయి. ఇక సురేష్, దేవయాని, ఉన్నిముకుందన్ లాంటి సీనియర్ ఆర్టిస్టులను కూడా కేవలం తెరను నింపడం కోసం వాడడం కాస్త ఇబ్బందిపెడుతుంది.
సాంకేతికవర్గం పనితీరు : “24” చిత్రంలో తన కెమెరా పనితనంతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన తిరు ఈ చిత్రంలో ఎమోషన్ కు తగ్గట్టు లైటింగ్ మరియు టింట్ ను వాడి సినిమాలోని ఫీల్ ను ఆడియన్స్ కు అర్ధమయ్యేలా ఎలివేట్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన బాణీలు అతడి పాత సినిమాలోవే కాస్త అటుఇటు మార్చి “సరి” అనిపించాడు. నేపధ్య సంగీతం విషయంలోనూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అరబిక్ మిక్స్ లో ఇచ్చిన బిజీమ్ కి సీన్ తో సంబంధం ఉండదు. మైత్రీ మూవీ మేకర్స్ కథను నమ్మారో లేక దర్శకుడ్ని నమ్మారో తెలియదు కానీ.. నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ప్రతి ఫ్రేములోనూ వారు పెట్టిన డబ్బులు కనిపిస్తూ ఉంటాయి.
“మిర్చి, శ్రీమంతుడు” చిత్రాలతో దర్శకుడిగానే కాక రచయితగానూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన కొరటాల శివ.. ఈ సినిమాతో మాత్రం ఒక్కసారిగా జారిపడ్డాడు అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికే సరిపోయింది. పోనీ సెకండాఫ్ ఏమైనా ఉంటుందా అనుకొంటే.. ఆశించిన వారి నెత్తిమీద పెద్ద రెంచీతో బాదాడు. ఓవరాల్ గా.. కొరటాల దర్శకుడిగానే కాక రచయితగానూ దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ : కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు “కథలో స్టైల్ ఉంటే చాలు దర్శకుడు స్టైలిష్ గా తీయకపోయినా సినిమా ఆడేస్తుంది”. సో, “జనతా గ్యారేజ్”కి కథే చాలా వీక్ కాబట్టి, మరి సినిమా ఆడుతుందో లేదో మనం చెప్పడం ఎందుకు. కాకపోతే.. కొరటాల మీద నమ్మకంతో, ఎన్టీయార్ అంటే విపరీతమైన అభిమానంతో థియేటర్లకు వెళ్ళే అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచే చిత్రమిది.