మొన్నీమధ్యనే మన ఫిల్మీ ఫోకస్‌లో చదివి ఉంటారు. ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది అని. ఇక్కడ కోల్‌కతా అని ఎందుకు రాయలేదో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా ఆ నగరం పేరు కలకత్తా అని ఉన్నప్పటిది అని. అయితే తాజా పుకార్ల ప్రకారం ఈ సినిమా ఏ కాలంలో నడుస్తుందో తెలిసింది. ఆ లెక్కన తొలిసారి రియల్‌టైమ్, రియల్ మోడ్‌లో ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయబోతున్నారు.
కొబ్బరికాయ కొట్టిన ఆరు నెలల తర్వాత తారక్ – నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైందనే విషయం తెలిసిందే. రామోజీ ఫిలింసిటీలోని రోడ్ల మీద పెద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతున్న సన్నివేశాల్ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఆ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రశాంత్ నీల్ యాక్షన్ అని చెబుతున్నారు. ఆ బ్యాగ్రౌండ్ చూస్తే సినిమా నేపథ్యంలో విషయంలో క్లారిటీ వస్తోంది.
ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు తన రెగ్యులర్ ఫార్మాట్ గ్రే కలర్‌లోనే ఉన్నాయి. సినిమా కూడా అలానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్‌లో పాత అంబాసిడర్ కారు, ఓల్డ్ సైకిళ్లు ఉన్నాయి. రోడ్ మీద అల్లర్లు జరిగిన విధానం కూడా ప్రజెంట్ స్టైల్‌లో లేదు. దీంతో విషయం ఏంటా అని ఆరా తీస్తే.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కథ 1960 బ్యాక్ డ్రాప్‌లోనిది అంటున్నారు.
సినిమా మొత్తం 1960 దశకం నేపథ్యంలో ఉండబోతోందట. ఆ సమయంలో బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో సన్నివేశాలు మొత్తం ఉంటాయట. అంటే గతం, ప్రస్తుతం లాంటివి కూడా ఉండవు అంటున్నారు. ఇక కథ, నేపథ్యానికి తగినట్లే ఎన్టీఆర్ గెటప్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. సినిమా కోసం ఇప్పటికే నాటి బెంగాల్ టైప్ సెట్స్ రూపొందిస్తున్నారట.