యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ 2022 జనవరి నెల 7వ తేదీన రిలీజ్ కానుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ ను తాజాగా పూర్తి చేసిన ఎన్టీఆర్ వచ్చే నెల నుంచి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకున్న తారక్ సోషల్ మీడియాలో ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఆ ఫోటోలను నిశితంగా గమనిస్తే ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజ్ ను గమనించవచ్చు. ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరకు వర్కౌట్లు చేస్తున్న సమయంలో కుడి చేతి వేలు విరిగిందని వేలుకు ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్లు సర్జరీ చేసి బ్యాండేజ్ వేశారని తెలుస్తోంది. డాక్టర్ల సూచనలను పాటిస్తూ యంగ్ టైగర్ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారని సమాచారం. ఎన్టీఆర్ చేతికి బ్యాండేజ్ కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం గాయం గురించి ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతుండటం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం చిరంజీవి మణికట్టుకు సర్జరీ జరగగా బాలకృష్ణ కూడా కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. వరుసగా టాలీవుడ్ హీరోలు సర్జరీల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తారక్ కొరటాల శివ సినిమాను వేగంగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారని తెలుస్తోంది.