ఇండియన్ సినిమాలో ప్రయోగం అనగానే… ఇప్పుడు చాలామంది హీరోలు, దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. కొన్నేళ్ల క్రితం ‘ప్రయోగం’ అనే మాట వింటే ఇండియన్ సినిమాలో గుర్తుకొచ్చే పేరు కమల్ హాసన్ (Kamal Haasan) . పాత్రల ఎంపిక విషయంలో, మేకప్ విషయంలో, నిర్మాణ విషయంలో, దర్శకత్వ శైలి విషయంలో ఆయన చేయని ప్రయోగాలు లేవు. అయితే ఇప్పుడు ఆయన సినిమాతోనే మరో అదిరిపోయే ప్రయోగం చేశారు. దీంతో కళ్లు చెదిరిపోయే క్వాలిటీతో ఆయన సినిమా చూడొచ్చు.
భారతీయ సినిమాకు ఇప్పుడు పాన్ ఇండియా ఫీవర్ పట్టుకుని వేలాడుతోంది కానీ… నిజానికి ఎప్పుడో కమల్ హాసన్ ఈ పని చేశారు. అలా ఆయన చేసిన ఓ సినిమా ‘హే రామ్’. 2000లో వచ్చిన ఆ సినిమాకు మంచి పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను నేటితరం ఆలోచనలకు తగ్గట్టు క్వాలిటీ పెంచి రిలీజ్ చేస్తున్నారు. అంటే 4Kలోనే 8Kలోనో అనుకుంటున్నారేమో. ఏకంగా ఆ రెండూ కలిపి 12Kలో. దీంతో ప్రపంచంలో తొలిసారి ఈ ఫీట్ సాధించిన సినిమా అవుతోంది.
సినిమాలో ప్రతి ఒక్క డీటెయిల్ స్పష్టంగా కనిపించేలా 12కె నాణ్యతకు సినిమాను పెంచి రిలీజ్ చే్తున్నారు. ఎన్ని వందల ఇంచీల స్క్రీన్ అయినా పిక్సల్ చెక్కుచెదరకుండా ఆ క్వాలిటీలో కనిపిస్తుందట. ఇరవై సంవత్సరాల క్రితం తీసిన సినిమానేనా ఇది అనే డౌట్ వచ్చేలా నాణ్యతను పెంచారు అని చెబుతున్నారు. నిజానికి కొన్నేళ్ల క్రితమే ‘హే రామ్’ సినిమాను 4Kకి మార్చి తమిళనాడులో రీ రిలీజ్ చేశారు. అక్కడ మంచి స్పందన వచ్చింది కూడా.
అయితే అప్పుడు తెలుగులో సినిమా రాలేదు. దీంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. మరిప్పుడు తెలుగులో వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… గాంధీ మరణం చుట్టూ తిరిగే కథతో సాగే సినిమా ఇది. నాటి ఘటనలో కొన్ని వివాదాస్పద అంశాలు ఈ సినిమాలో చర్చించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రత్యేక పాత్రలో నటించారు కూడా.