ప్రముఖ కథానాయకుడు, మక్కళ్ నీది మయ్యుం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు వెళ్లనున్నారా? అవుననే అంటున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు. గత కొన్ని నెలలుగా ఈ మేరకు వార్తలొస్తున్నా ఎక్కడా స్పష్టమైన సమాచారం అయితే రావడం లేదు. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. దీంతో కొత్త పుకార్లు కొన్ని పుట్టుకొచ్చాయి. అందులో ఆయన రాజకీయ జీవితం త్వరలో ముగుస్తుంది అని కూడా అంటున్నారు.
మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా త్వరలో దిల్లీకి వెళ్తారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ సూచనప్రాయంగా తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తంగవేల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని, అమెరికాలో ఉన్న ఆయన సినిమా చిత్రీకరణ ముగించుకున్నాక జులైలో ఆ బాధ్యతలు చేపడతారని కూడా ఆయన పేర్కొన్నారు.
2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు కేటాయించేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జులైలో ముగుస్తోంది. అందులో ఒక స్థానం కమల్‌కు ఇచ్చే అవకాశం ఉంది అనేది తమిళనాడు రాజకీయ వర్గాల్లో టాక్. ఆ లెక్కన జులై తర్వాత కమల్ హాసన్ ఎంపీ అవుతారు.
అయితే, ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం అంటే సీరియస్ రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవ్వడమే అని టాక్ నడుస్తోంది. రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత ఆయన చిరంజీవిలా రాజకీయాలకు దూరమవుతారు అని కూడా అంటున్నారు. మరి నిజంగానే ఆయన ఎంపీ అవుతారా? అయ్యాక చిరంజీవిలా (Chiranjeevi) రాజకీయాలు వద్దు అనుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కమల్ ‘థగ్‌లైఫ్’ (Thug Life) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.