కమెడియన్ గా స్టార్ స్టేటస్ ను పొందిన తర్వాత హీరోగా కూడా మారి పలు హిట్లు అందుకున్నాడు సునీల్. కానీ హీరోగా ఎక్కువ కాలం అతను నిలబడలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతను మళ్ళీ కమెడియన్ గా మారడానికి ప్రయత్నించాడు. ఈ దశలో మళ్ళీ అతని పూర్వవైభవం దక్కడం ఖాయం.. తన మార్క్ కామెడీతో చక్రం తిప్పడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో సునీల్ కు రీ ఎంట్రీ పడలేదు. కానీ సపోర్టింగ్ రోల్స్ మరియు నెగిటివ్ రోల్స్ తో పర్వాలేదు అనిపించాడు. అయితే అతను మళ్ళీ హీరోగా నటించిన చిత్రం ‘కనబడుటలేదు’. ఇది సునీల్ మార్క్ కామెడీ సినిమా కాదు ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని ట్రైలర్ తోనే స్పష్టం చేసింది చిత్ర బృందం. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లానే ప్రామిసింగ్ గా ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకుందాం రండి.
కథ: సూర్య (సుక్రాంత్), శశిద (వైశాలిరాజ్) ప్రేమలో ఉంటారు.ఈ విషయం తెలీకుండా ఆదిత్య (యుగ్‌రామ్) అనే అబ్బాయి కూడా శశిదని ప్రేమిస్తాడు. మరో పక్క సూర్య,శశిద ల పెళ్లికి పెద్దలు అంగీకరించరు.ఈ క్రమంలో వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు.కానీ శశిదని కలవడానికి సూర్య రాడు. దాంతో అతను మోసం చేసాడనే ఫీలింగ్ శశిదకి కలుగుతుంది. ఈ క్రమంలో ఆమెకి ఆదిత్యతో పెళ్లి జరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆమెకి సూర్య పై పగ పెరుగుతుంది.
సూర్యని ఎలాగైనా చంపేయాలని తన భర్త ఆదిత్య సాయం కోరుతుంది. అలా ఇద్దరూ కలిసి సూర్యని చంపడానికి విశాఖపట్నం వెళితే…అప్పటికే సూర్య కనబడకుండా పోతాడు.సూర్య ఎక్కడికి వెళ్లినట్టు? అతను బ్రతికున్నాడా? చనిపోయాడా? అనే మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) రంగంలోకి దిగుతాడు? అతను ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: సునీల్ డిటెక్టివ్ పాత్రలో చక్కని నటన కనబరిచాడు. ఇతని పాత్రని కూడా దర్శకుడు బాగానే డిజైన్ చేసాడు.సునీల్ తర్వాత వైశాలిరాజ్ మంచి మార్కులు కొట్టేస్తుంది. సుక్రాంత్ పాత్ర ఓకే అనిపిస్తుంది. హిమజ పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేదు.ఆమె నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సీఐ విక్టర్‌రాజుగా పాత్రని పోషించిన కిషోర్ కుమార్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది.అతని హావభావాలకి ఆ డైలాగులకు సంబంధం ఉండదు. బహుశా డబ్బింగ్ లోపం అయ్యి ఉండొచ్చు.
‘కంచెరపాలెం’ రాజు పాత్ర కాసేపే ఉంటుంది అది కూడా అతికినట్టు అనిపిస్తుంది. ‘కంచెరపాలెం’ తర్వాత అతనికి మంచి పాత్ర దొరకలేదు. ఏదో అతని క్రేజ్ ను వాడుకోవాలి అన్నట్టు అతనికి ఏదో ఒక పాత్రని పడేస్తున్నారు అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ విభాగంలో మధు పొన్నాస్ అందించిన నేపధ్య సంగీతం మెయిన్ హైలెట్ అని చెప్పాలి. సందీప్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడు బాలరాజు రాసుకున్న లైన్,అల్లుకున్న పాత్రలు బాగానే ఉన్నా.. తెర పై అతను ఆవిష్కరించిన విధానం ఆకట్టుకోలేదు. అతను తడబడ్డాడు అని క్లియర్ గా తెలుస్తుంది.ప్లాట్ ఇంట్రెస్టింగ్ గానే ప్రారంభం అవుతుంది.సునీల్ పాత్రని అతను పరిచయం చేసిన విధానం కూడా బాగుంది.వైశాలిరాజ్ పాత్రని కూడా అతను బాగానే డిజైన్ చేసుకున్నాడు.
ఆ రెండు పాత్రలకి పేర్లు పెట్టనవసరం లేదు. కానీ మిగిలిన పాత్రలకి ఇతను ఎంచుకున్న క్యాస్టింగ్ మ్యాచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. అందుకే హాఫ్ బాయిల్ అన్నట్టు తయారయ్యింది. ఎమోషనల్ సీన్స్ కూడా పేలవంగానే ఉన్నాయి. నిర్మాతలు ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి సినిమా క్వాలిటీగానే కనిపిస్తుంది.
విశ్లేషణ: ‘కనబడుటలేదు’ మరీ తీసిపారేసే ప్లాట్ ఏమీ కాదు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మంచి క్యాస్టింగ్ కనుక ఉంటే కచ్చితంగా ఇది మంచి మిస్టరీ ఉన్న మూవీలా అనిపించేదేమో.అయినప్పటికీ సునీల్ పాత్ర కోసం ఒకసారి అయితే చూడదగ్గ సినిమానే. ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు నిలబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.