పవన్ కల్యాణ్ హీరో అవ్వడానికి, వచ్చాక తిరిగి వెళ్లిపోదాం అనుకున్న సమయంలో ఆగడానికి, ఇప్పుడు ఇలా స్టార్ హీరోగా ఎదగడానికి పునాది వేసింది చిరంజీవి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పవన్‌ను నమ్మి సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది మరో ఇద్దరు. అందులో ఒకరు పవన్ వదిన సురేఖ కాగా, మరో వ్యక్తి ఆమె మాతృమూర్తి కనకరత్నమ్మ. ఈ విషయం గతంలో ఓ సందర్భంలో బయటకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ చర్చలోకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టి తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్ కల్యాణ్. ఇలా జరగడానికి కారణం కనకరత్నమ్మ చాలా సార్లు పవన్‌ను ముందుకు పుష్ చేయడమే. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇటీవల చెప్పుకొచ్చారు. కనకరత్నమ్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరై కనకరత్నమ్మకు నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే పవన్‌కు తన తల్లి అందించిన ప్రోత్సాహం గురించి వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌ను తన తల్లి కనకరత్నమ్మ ప్రేమగా ‘కల్యాణి’ అని పిలిచేవారట. పవన్‌ను చూసి అందంగా ఉన్నావు, సినిమాల్లో ఎందుకు ట్రై చేయవు అని అడిగేవారట. సిగ్గరి అయిన పవన్ సినిమాలు తన వల్ల కాదని అనేవాడట. అలా ఓ రోజు అరవింద్‌ను పిలిచి, అందంగా ఉన్నాడు, ఇతణ్ని హీరోను చేయొచ్చు కదా అని అన్నారట. అలా కల్యాణ్‌ను ప్రోత్సహించి హీరోను చేయడం వెనుక తన తల్లి పాత్ర ఉందని అరవింద్ చెప్పుకొచ్చారు.
‘సుస్వాగతం’ సినిమా చేసినప్పుడు ఓసారి పవన్ ‘ఇక సినిమాలు వద్దు అనుకున్నారు’. అప్పుడు వదిన సురేఖ ప్రోత్సహించి ముందుకు పుష్ చేశారు. అలా సినిమాల్లోకి వచ్చి, కొనసాగించిన పవన్ ఇప్పుడు పవర్ స్టార్ అయి ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు.