కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలతో జత కడుతూ బిజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఆమెకి బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ బ్యూటీ. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చాయి.
అందులో ‘యానిమల్’ అనే భారీ బడ్జెట్ సినిమా ఉంది. సందీప్ వంగ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న ‘స్క్రూడీలా’ సినిమాకి ఓకే చెప్పింది రష్మిక. దర్శకుడు శశాంక్ ఖైతాన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
లెక్కలన్నీ వేసుకున్న కరణ్ ఈ సినిమా వర్కవుట్ కాదనే నిర్ణయానికి వచ్చారట. ఆ విధంగా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా కోసం టైగర్ ష్రాఫ్ రూ.35 కోట్లు అడిగారట. రష్మిక రెమ్యునరేషన్ రూ.4 కోట్లు. మొత్తం సినిమా బడ్జెట్ రూ.140 కోట్లు అయ్యేలా ఉంది. ఇటీవల విడుదలైన ‘లైగర్’ సినిమాతో కరణ్ జోహార్ బాగా దెబ్బతిన్నారు.
అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమాకి రూ.140 కోట్లు పెడితే రికవరీ కష్టమని కరణ్ అనుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఓకే.. కానీ తేడా వస్తే అంతే సంగతులు. అందుకే ఒకవేళ సినిమా ప్లాప్ అయినా.. తక్కువ నష్టం వచ్చే సినిమాలనే చేయాలనుకుంటున్నారు కరణ్. ఈ కారణంతోనే రష్మిక సినిమాను ఆపేశారు.