‘‘కళ్లు మూసుకుని కనేది కల.. కళ్లతో అభినయించేది కళ.. నిద్రపోతూ కనేది కల.. నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ.. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు..’’ ఈ డైలాగ్ ‘నరసింహ నాయుడు’ మూవీలో కళకున్న విలువని, కళాకారుల గొప్పదనాన్ని తెలియజెయ్యడానికి బాలయ్య చెప్తాడు. నిజమే.. సినిమా సమాజంలో మార్పుతీసుకొస్తుంది అనడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి. గమనించాలే కానీ సినిమా నుండి పాజిటివ్ విషయాలు చాలా నేర్చుకోవచ్చు.. వాటిని అమలు చెయ్యొచ్చు కూడా..
ఇప్పుడలాంటి మార్పుకి మరోమారు శ్రీకారం చుట్టింది.. లేటెస్ట్ సెన్సేషన్ రిషబ్ శెట్టి ‘కాంతార’.. రిషబ్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన ఈ మాస్టర్ పీస్ మూవీ రెండోవారంలోనూ వరల్డ్ వైడ్ సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ‘కాంతార’ కర్ణాటక ప్రాంతంలోని కొన్ని కళలు, దైవశక్తులు, ప్రజల నమ్మకాలు, సంస్కృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేయడమేకాక.. కళాకారుల గొప్పదనాన్ని కూడా చాటి చెప్పింది.. దీంతో కర్ణాటకలోని పలు ప్రాంతాలు, కళల గురించి.. వాటి హిస్టరీ గురించి జనాల్లో ఆసక్తి కలిగింది.
కర్ణాటక ప్రాంతం యొక్క ఆత్మను కథావస్తువుగా చేసుకుని ప్రపంచమంతా తెలిసేలా చేసేలా చేసిన రిషబ్ శెట్టిని భాషాబేధం లేకుండా అందరూ అభినందిస్తున్నారు. ఊహించని విధంగా బాక్సాఫీస్ బరిలో కోట్లాది రూపాయల కలెక్షన్లతో దూసుకుపోతుందీ చిత్రం. తాజాగా ‘కాంతార’ సినిమా కర్ణాటక ప్రభుత్వాన్ని కదిలించింది. అందుకే అక్కడి ప్రభుత్వం కళాకారుల కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.. కోస్టల్ కర్ణాటకలోని సంప్రదాయ దైవనర్తకులకు ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
అంతరించిపోతున్న ప్రాచీన కళలను, వాటిని పెంచిపోషిస్తున్న కళాకారులకు సాయమందించాలని నిర్ణయించుకుంది. అరవై సంవత్సరాలు పైబడిన దైవ నర్తకులకు.. వారి ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘కాంతార’ సినిమాతో తమ సంస్కృతీ, సాంప్రదాయాలను అందరికీ తెలిసేలా చెయ్యడమే కాక.. కళనే నమ్ముకున్న తమకు ప్రభుత్వం సాయం చేయడానికి కారణమైన రిషబ్ శెట్టికి కళాకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..