మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కొంతకాలం క్రితం చిరంజీవి ఒక సందర్భంలో చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా వైసీపీ నేతలు చిరంజీవిపై విమర్శలు చేయడం జరిగింది. కొడాలి నాని చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన కొన్ని కామెంట్ల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే చిరంజీవి పుట్టినరోజున కొడాలి నాని మాత్రం తాను చిరంజీవిపై ఆ కామెంట్లు చేయలేదని చెప్పారు.
చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడిని కాదంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. చిరంజీవిపై తాను విమర్శలు చేసినట్టు ప్రూవ్ చేయాలని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను శ్రీరామ అని అన్నా కొన్ని పార్టీల నేతలకు బూతులా వినిపిస్తుందని కొడాలి నాని పేర్కొన్నారు.
పొలిటికల్ గా (Chiranjeevi) చిరంజీవిపై విమర్శలు చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని కొడాలి నాని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తే మాత్రం వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలిపెట్టనని కొడాలి నాని అన్నారు. చిరంజీవి ఎవరి జోలికి వెళ్లరని ఆయనపై విమర్శలు చేయాల్సిన అవసరం నాకు ఏముందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. చిరంజీవితో తనకు అగాధం సృష్టించాలని కొన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో గుడివాడలో చిరంజీవికి నమస్కారం పెట్టానని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొడాలి నాని చెప్పుకొచ్చారు. చిరంజీవి చెప్పిన సూచనలను పాటించడానికి తనకు అభ్యంతరం లేదని కొడాలి నాని తెలిపారు. తనకు సలహాలు ఇచ్చిన విధంగానే సినిమా ఇండస్ట్రీలో నటించడం చేత కాని, డ్యాన్స్ లు రాని పకోడిగాళ్లకు కూడా సలహాలు ఇవ్వాలని కోరానని కొడాలి నాని వెల్లడించారు.