చియాన్ విక్రమ్ (Vikram) కుమారుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) మంచి టాలెంటెడ్ నటుడు అని మొదట్లోనే నిరూపించుకున్నాడు. అయితే తన సినీ ప్రస్థానాన్ని గొప్పగా మొదలుపెట్టాలనుకున్నా, అనుకున్నంత స్థాయిలో మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాడు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ సినిమా ఆయనకు భారీ బూస్ట్ ఇవ్వలేదు. అసలు మొదట బాలా దర్శకత్వంలో వర్మగా మొదలై, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో కొత్తగా చిత్రీకరించడం గందరగోళాన్ని సృష్టించింది.
దీంతో ధృవ్‌కి లాంచింగ్ మూవీ అనుకున్న విధంగా కలిసిరాలేదు. ఆ తరవాత మహాన్, బీసన్ వంటి సినిమాల్లో నటించాడు. మహాన్ ఓటీటీలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక బీసన్ సినిమాకు మారి సెల్వరాజ్ ( Mari Selvaraj) దర్శకత్వం వహిస్తున్నా, అది ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. మరోవైపు, ధృవ్ కెరీర్‌కు బిగ్ లెవెల్ బూస్ట్ ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కోలీవుడ్‌లో కనిపించడం లేదు. స్టార్ హీరో కుమారుడిగా మంచి మార్కెట్ ఉన్నా, సరైన బ్రేక్ రాకపోవడంతో ఇప్పుడు కొత్త ప్లాన్ వేసుకుంటున్నాడట.
తాజాగా, ధృవ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ప్రభాస్ (Prabhas) రాధేశ్యామ్ (Radhe Shyam) ఫేమ్ రాధాకృష్ణతో (Radha Krishna Kumar) ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. రీసెంట్‌గా రాధాకృష్ణ చైన్నైలో ధృవ్‌ని (Dhruv Vikram) కలిసి, ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేశారని, విక్రమ్ మాత్రం ఆ మీటింగ్‌లో లేడని అంటున్నారు. మరి ఈ మీట్‌లో కథ వినిపించారా? లేక సినిమాకు సంబంధించిన బేసిక్ చర్చలు జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కోలీవుడ్ హీరోలలో చాలామంది తెలుగు మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారు. విజయ్ (Vijay Thalapathy) ఇప్పటికే లియో (Leo) సినిమాతో తెలుగు బాక్సాఫీస్‌ని టచ్ చేశాడు. ధనుష్ (Dhanush) , సూర్య (Suriya), కార్తీ (Karthi), శివ కార్తికేయన్ (Sivakarthikeyan) వంటి హీరోలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో ధృవ్ కూడా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సక్సెస్ సాధించాలంటే కంటెంట్‌తో పాటు స్ట్రాంగ్ ప్రమోషన్ కూడా అవసరమే. మరి ధృవ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.