రచయితగా కొరటాల శివ అనేక స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు. అవన్నీ విజయం సాధించాయి. డైరక్టర్ గా ప్రభాస్ అవకాశమిచ్చారు. మిర్చి సినిమాతో తనప్రతిభను నిరూపించుకున్నారు. పగలతో ఏమీ సాధించలేము.. ప్రేమతో అన్నీ సాధించుకోవచ్చని సందేశంతో కమర్షియల్ హిట్ కొట్టారు. ఆరంభం అదిరింది సరే.. ద్వితీయ విఘ్నం అధిగమిస్తారా? అని ఎదురుచూసారు. మహేష్ బాబు కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సొంతఊరికి కొంతైనా మేలు చేద్దామని సందేశాన్ని ఇస్తూ శ్రీమంతుడు అనిపించుకున్నారు. మూడో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో. జనతా గ్యారేజ్ లో తారక్ ని కొత్తగా చూపించి.. మాస్ ప్రేక్షకులని కాదు క్లాస్ ఆడియన్స్ సైతం ఎన్టీఆర్ ఆకర్షించేలా చేశారు. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశాన్నిచ్చారు.
ఇలా టాలీవుడ్ శంకర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక నాలుగో సినిమా మహేష్ బాబుతో భరత్ అనే నేను చేశారు. రాజకీయం అంటే ఎలా ఉండాలి? నాయకుడంటే ఎలా ఉండాలనే ? విషయాలను సరికొత్తగా చూపించి సూపర్ హిట్ సొంతంచేసుకున్నారు. ఇన్ని విజయాల తర్వాత కొరటాల ఏ హీరోతో సినిమా చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ సాహోతో పాటు రెండు సినిమాలు కమిట్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వరుసగా రెండు చిత్రాలకు సైన్ చేశారు. మహేష్ బాబు అయితే ముగ్గురుదర్శకులకు మాట ఇచ్చారు. చిరు, బాలయ్యలు కూడా బిజీ బిజీ. ఇక టాలీవుడ్ లో మిగిలిన స్టార్ హీరో అల్లు అర్జున్. అతను కథలు వింటున్నప్పటికీ దేనికీ ఓకే చెప్పలేదు. సో అతనితోనే కొరటాల సినిమా చేయవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.