‘దేవర’ (Devara) సినిమాలో తారక్‌ను (Jr NTR) చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. నిజానికి ఆ ముచ్చట అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్‌కి దక్కాలి అనే విషయం తెలుసా? అల్లు అర్జున్ 21వ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే బన్నీనే ‘దేవర’ సినిమానే చేసి ఉండేవాడు. ఆ సినిమా టీమ్ అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూసినవాళ్లకు ఈ విషయం అర్థమవుతుంది కూడా. ఎందుకంటే సముద్రం బ్యాక్‌డ్రాప్‌లోనే ఆ పోస్టర్ సిద్ధం చేశారు.
సముద్రం ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. ఓవైపు ఊరు.. దాని చుట్టూ రకం, మరోవైపు చిన్నపాటి కొండ కనిపిస్తాయి. ఇదంతా చూశాక ‘దేవర’ కథే అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. ఎందుకో కానీ కొరటాల శివ (Koratala Siva) ఆ సినిమా నుండి బయటకు వచ్చేశారు. ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘దేవర’ సినిమాను రెండు పార్టులుగా సినిమా చేసి ఓ పార్టును విడుదల చేశారు కూడా. అలా బన్నీ – కొరటాల సినిమా ఆగిపోయింది.
ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి చర్చ మొదలైంది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు అనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. బన్నీకి కొరటాల ఇటీవల ఓ కథను చెప్పారని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా విషయంలో ముందుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ‘పుష్ప: ది రూల్’ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ (Trivikram) సినిమా ఉండాలి. కానీ ఆ సినిమాకు ఇంకా టైమ్ పట్టేలా ఉంది.
ఇటు కొరటాల కూడా ‘దేవర 2’ సినిమా చేయాల్సి ఉంది. అయితే తారక్ ఇతర సినిమాల పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టారట. అందుకే ఈ గ్యాప్‌ను వినియోగించుకుందామని అల్లు అర్జున్, కొరటాల అనుకుంటున్నారట. మరి కొరటాల ఏ కథ తీసుకొచ్చారు, బన్నీ ఏం చేస్తాడు అనేది చూడాలి.