దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెబుతుంటారు పెద్దవాళ్లు. మిగిలినవాళ్ల సంగతేమో కానీ, మన సినిమా వాళ్లు, అందులో సినిమా నాయికలు దీనిని బాగానే ఆచరిస్తుంటారు. హిట్ కొట్టగానే వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్తారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే బొక్కబోర్లాపడతారు అనుకోండి. జాగ్రత్తగా ఎంచుకుంటూ మంచిగా రెమ్యూనరేషన్ పెంచుకుంటుంటారు. అలాగే డబ్బులు సంపాదిస్తారు. అయితే కృతి శెట్టికి ఇంకా ఈ విషయం అర్థం కావడం లేదా? మంచి సినిమాలే చేయాలి,
పేరున్న పాత్రలే చేయాలి అని అనుకోవడం సహజం. కానీ పెద్ద దర్శకుడు, నిర్మాతో అడిగితే అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలకు కూడా ఓకే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు చూస్తుంటే కృతి శెట్టి ఈ పాయింట్ పట్టుకున్నట్లు అనిపించడం లేదు. సుకుమార్ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘18 పేజెస్’లో కృతికి ప్రత్యేక అతిథి పాత్రను ఆఫర్ చేసిందట చిత్రబృందం. అయితే కారణమేంటో గానీ ఆ ఛాన్స్‌ను బేబమ్మ తిరస్కరించిందట.
సుకుమార్ సినిమా అంటే అతిథి పాత్ర అయినా బలంగానే ఉంటుందంటారు. అలాంటిది ఆ పాత్రను చేయడానికి కృతి ఎందుకు వద్దనుకుందో. ‘ఉప్పెన’ లాంటి విజయం ఆమెకు దక్కిందంటే దానికి సుకుమార్ కూడా ఓ కారణమనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కృతి చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. నాని, సుధీర్‌బాబు, రామ్ సినిమాలు ఒప్పేసుకుంది. కాబట్టి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతోందా? లేక కెరీర్ తొలినాళ్లలో ఎందుకు అతిథి పాత్ర అనుకుందో తెలియాల్సి ఉంది.