మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లూసిఫర్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్కడ అప్పటివరకు టాప్ ప్లేస్లో ఉన్న ‘బాహుబలి’ (Baahubali) రికార్డులని బ్రేక్ చేసింది ఈ సినిమా. తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆ సినిమాని ‘గాడ్ ఫాదర్’ (Godfather) గా రీమేక్ చేయడం జరిగింది. అది కూడా ఓ మాదిరిగా ఆడింది అంతే..! మొత్తానికి ఈ సినిమాకి రెండో భాగంగా ‘ఎల్2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. మార్చి 27న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఆయన కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షో వేసి సినిమాని చూపించడం జరిగింది. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వాళ్ళ టాక్ ప్రకారం.. తన చెల్లెల్ని వేధించి, తండ్రిని హతమార్చిన దుర్మార్గుడిపై రివేంజ్ తీర్చుకున్న తర్వాత.. స్టీఫెన్ ఎక్కడికి వెళ్ళాడు? అతని గతమేంటి? మళ్ళీ రాందాస్ పార్టీలో చోటు చేసుకున్న కుంభకోణాలు ఏంటి? అనే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంటుందట.
సినిమాలో చాలా పాత్రలు ఉంటాయట. ‘పొన్నియన్ సెల్వన్’ ‘సలార్’ సినిమాల తర్వాత ఎక్కువ పాత్రలు ఉన్న సినిమా ఇదే అని అంటున్నారు. అయితే మాస్ ఆడియన్స్ ని అలరించే ఎలివేషన్స్ ఎక్కువగానే ఉంటాయని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ .. కచ్చితంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోలతో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.