హీరోయిన్స్ విజయాలను అందుకోవాలంటే.. అందం, అభినయం మీద మాత్రమే కాదు కథల ఎంపిక విషయంలోనూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నచ్చని కథకి నిర్మొహమాటంగా నో చెప్పడం ఎంత అవసరమో.. మంచి కథకి ఎస్ చెప్పడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి రీసెంట్ గా నేర్చుకుంది. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయన సినిమాల్తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈ భామ శ్రీరస్తు శుభమస్తు తో క్లాసిక్ హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాతే తడబడింది. ఆమె చేసిన రాధ, మిస్టర్, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ…నాలుగు సినిమాలు చేసింది. ఇందులో ఏదీ సరైన హిట్ ఇవ్వలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో మంచి కథకి కూడా ఓకే చెప్పాలా? వద్దా? ఆలోచించి.. హిట్ కథలను వదులుకుంది. అవి ఏమిటంటే తొలి ప్రేమ, గీత గోవిందం.
“తొలిప్రేమ”లో వరుణ్ తేజ్ సరసన రాశీ ఖన్నా కంటే ముందు లావణ్యని అడిగారంట. ఆమె నో చెప్పడంతో ఆ ఛాన్స్ రాశీఖన్నా కి వెళ్ళింది. ఇక ఐదురోజుల్లో 50 కోట్లు వసూలు చేసిన గీతా గోవిందంలో తొలుత దర్శకుడు పరుశురాం హీరోయిన్ గా లావణ్య త్రిపాఠినే తీసుకున్నారట. ఆమెతో ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ ఆఖరి నిమిషంలో లావణ్య తప్పుకుంది. ఓ తమిళ సినిమా ఒప్పుకున్న కారణంగా గీతాగోవిందం మూవీని వదులుకుంది. ఆమె చేసిన పెద్ద తప్పు ఇదే. ఇప్పుడు గీతాగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. హీరోయిన్ రష్మిక కు మంచి పేరు వచ్చి వరుస అవకాశాలు వెల్లువలా వస్తుండడంతో లావణ్య తెగ బాధపడిపోతుందంట. మరోసారి ఇలాంటి కథలను వదులుకోకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం.