కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది. ‘ఖైదీ’ ‘విక్రమ్’ వంటి కల్ట్ సినిమాలని అందించిన లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో.. మొదటి నుండి ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తెలుగులో చాలా వరకు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే..! తమిళ్ లో కూడా భారీ కలెక్షన్లను రాబడుతోంది.
ఈ చిత్రంతో 7వ సారి రూ.200 కోట్ల క్లబ్ లో చేరాడు విజయ్. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా ‘లియో’ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొత్తగా చేసింది, చూపించింది అంటూ ఏమీ లేదని అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున- కృష్ణ..ల ‘వారసుడు’ సినిమా నుండి చాలా సినిమాల పోలికలు ‘లియో’లో కనిపించాయని అంటున్నారు. ముఖ్యంగా ‘లియో’ (LEO Movie) సినిమాకి హైలెట్ గా కాఫీ షాప్ ఫైట్ ను చెప్పుకోవచ్చు.
ఆ ఫైట్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టిస్తుంది. ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశాడు. అయితే ఈ ఫైట్ మొత్తం తెలుగు సినిమాలో నుండి లేపేశారట. వివరాల్లోకి వెళితే.. గతంలో జగపతి బాబు హీరోగా ‘గాయం 2 ‘ అనే సినిమా వచ్చింది. ఇందులో కూడా అలాంటి ఫైట్ ఒకటి ఉంది. దీంతో ‘లోకేష్ కనగరాజ్.. మన తెలుగు సినిమా నుండే లేపేసి మళ్ళీ మనకే చూపించాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.