దర్శకుడిగా జోరు మీదున్నప్పుడు కుర్ర దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మనం చూస్తుంటాం. మన దగ్గర అగ్ర దర్శకులుగా ఉన్న కొంతమంది దర్శకులు ఇలా చేసి చూపించారు కూడా. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని కుర్ర దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు కూడా. ఇప్పుడు ఇదే వరుసలో ఎల్‌సీయూ సృష్టికర్త లోకేశ్ కనగరాజ్ కూడా వస్తున్నారు. అవును లోకేశ్ కొత్తగా ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఈ విషయంలో పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
జి స్క్వాడ్ అనే పేరుతో లోకేశ్ (Lokesh Kanagaraj) కొత్తగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంబించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ నిర్మాణ సంస్థ లోగోను, ఆలోచనను వివరించారు. ‘జి స్క్వాడ్’ బ్యానర్‌ను ప్రారంభించానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. దీని ద్వారా నా స్నేహితులు, అసిస్టెంట్లను ప్రోత్సహించాలనుకుంటున్నాను. వారి క్రియేటివిటీని అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈ సంస్థలో తొలుత వారి సినిమాలే ఉంటాయి అని లోకేశ్ పోస్టులో రాసుకొచ్చారు.
నా సన్నిహితులు చేసిన సినిమాలు చూసి ఆనందించాలని… మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలానే మాపై ఉండాలని కోరుకుంటున్నాను అని కోరారు లోకేశ్. ‘జి స్క్వాడ్’ బ్యానర్‌లో తెరకెక్కే తొలి సినిమా అప్‌డేట్స్ త్వరలో ఇస్తాను అని చెప్పారు. దీంతో ఏ సినిమా ఉండొచ్చు, ఎలాంటి సినిమా ఉండొచ్చు అంటూ అంచనాలు వేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ బ్యానర్‌లో క్రియేటివిటీ ఉన్నవాళ్లకు పండగ లాంటిదే అంటున్నారు.
సందీప్ కిషన్ ‘మానగరం’ సినిమాతో సగటు దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన లోకేశ్ కనగరాజ్… ఆ తర్వాత కార్తి ‘ఖైదీ’ సినిమాతో తనలోని బెస్ట్ క్రాఫ్ట్స్‌మన్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే విజయ్‌తో ‘మాస్టర్’ తీశారు. ఆ వెంటనే ‘ఎల్‌సీయూ’ ఏర్పాటు చేస్తూ కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ సినిమా చేశారు. ఇటీవల విజయ్‌తోనే ‘లియో’ చేసి ఆ సినిమాటిక్ యూనివర్స్‌ను కొనసాగించారు. త్వరలో రజనీకాంత్‌తో ఆ యూనివర్స్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు.