ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. ఆయన దాదాపు 300 చిత్రాల్లో రెండు వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. ఎస్‌బీఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన… సాహిత్యం మీద మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. అదే ఆయనను గీత రచయితను చేసింది. 11వ ఏటే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా…’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు.
అప్పుడప్పుడు నాటకాలు వేసేవారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారట ఆయన. నెల్లూరుకు చెన్నై దగ్గరే కావడంతో వెన్నెలకంటి సరదాగా అక్కడకు వెళ్తుంటేవారట. అలా 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి ‘శ్రీరామచంద్రుడు’లో ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల…’ పాట రాసే అవకాశమిచ్చారు. అదే వెన్నెలకంటి తొలి సినీ గీతం. 1987లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నా చెల్లెలు’కి ‘అందాలు ఆవురావురన్నాయి…’ పాట రాశారు. వెన్నెలకంటి ప్రయాణం ఊపందుకున్నాక ఎస్‌బీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి,
సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం కొనసాగించారు. ‘మహర్షి’ (1988)లో ఆయన రాసిన ‘‘మాటరాని మౌనమిది’’ పాట అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట హిట్ అవడంతో రవికిషోర్ ‘నాయకుడు’ డబ్బింగ్ వెర్షన్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్నిచ్చారట.