MAA: టాలీవుడ్‌ 90వ పుట్టిన రోజు… వేడుకల తేదీ ఇదే.. వివరాలు ఇవే!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో పండగ జరగబోతోంది. సినిమా పరిశ్రమకు 90 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా టాలీవుడ్‌ కీర్తిని చాటి చెప్పేందుకు ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వేడుకకు తేదీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘నవతిహి’ అనే పేరు పెట్టారని టాక్‌. మలేసియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జులై 20న ఈ వేడుకలు నిర్వహిస్తారు.

ఈ వేడుక కోసం సినిమా చిత్రీకరణలకు మూడు రోజులు సెలవులు ఇస్తారట. ఈ మేరకు ఆ రోజుల్లో షూటింగ్‌లు నిలిపేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్‌ రాజును (Dil Raju) ఇప్పటికే మంచు విష్ణు కోరారట. దానికి ఆయన నుండి సానుకూల స్పందన వచ్చిందట. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేసి, ఆ మొత్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా రానున్నారని సమాచారం.

సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘మా’ భవనానికి సంబంధించి ప్రకటన వస్తుందని మంచు విష్ణు చెప్పారు. ఇక ‘మా’ కార్యాలయం ఎక్కడ ఉండాలనే విషయంలో జనరల్‌ బాడీ సమావేశంలో చర్చించామని తెలిపారాయన. ‘మా’ సభ్యులంతా కలసి కొత్త భవనం అవసరం లేదని నిర్ణయించారట. ఫిల్మ్‌ ఛాంబర్‌ కొంత కార్యాలయంలోనే ‘మా’ భవనం ఉండాలని అనుకుంటున్నామని విష్ణు చెప్పారు. దీని గురించి ఆ వేడుకలో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.

కౌలాలంపూర్‌, బుకిట్‌ జలీల్‌లోని నేషనల్‌ స్టేడియంలో తెలుగు సినిమా వేడుకలు జరుగుతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు మలేసియా టూరిజం, ఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ వేడుకలో నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాయి. తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుక ఉంటుందని మంచు విష్ణ తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus