Maestro Review: మ్యాస్ట్రో సినిమా రివ్యూ & రేటింగ్!

హిందీలో ఘన విజయం సొంతం చేసుకున్న “అంధాధున్”కు హిందీ రీమేక్ గా రూపొందిన చిత్రం “మ్యాస్ట్రో”. నితిన్-నభా నటేష్-తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ ను థియేటర్లలో విడుదల చేయడానికి పరిస్థితులు సహకరించకపోవడంతో.. డిస్నీ హాట్ స్టార్ లో నేడు (సెప్టెంబర్ 17) విడుదలైంది. మరి నితిన్ అంధుడిగా ఆకట్టుకోగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: అరుణ్ (నితిన్) అంధుడిలా నటించే ఓ పియానిస్ట్. అంధుడిలా బిహేవ్ చేయడం వల్ల తన ప్యాషన్ మీద ఫోకస్ పెరుగుతుందనే ఆశ తప్ప.. మరో దురుద్దేశం ఉండదు. అయితే.. అనుకోని పరిస్థితుల్లో పరిస్థితుల్లో సీనియర్ హీరో మోహన్ (నరేష్) హత్యా తతంగాన్ని చూస్తాడు అరుణ్. మోహన్ భార్య సిమ్రాన్ (తమన్నా), ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్ రవీందర్ అందులో భాగస్వాములని తెలుసుకొని షాక్ అవుతాడు.

మోహన్ హత్య ఉదంతం అరుణ్ లైఫ్ ని ఎలా మార్చింది? దాని కారణంగా అతడు ఎదుర్కొన్న పర్యవసానాలేమిటి? అనేది “మ్యాస్ట్రో” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా ఒరిజినల్ వెర్షన్ లో ఆయుష్మాన్ ఖురానా ఈజ్ ను అందుకోవడానికి నితిన్ కాస్త కష్టపడ్డాడు. హిందీ వెర్షన్ ను చూడనివాళ్ళకు మాత్రం నితిన్ నటన భేష్ అనిపిస్తుంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు.. నితిన్ ఈ సినిమాతో పెద్ద రిస్క్ చేసినట్లే. ఒక భాషలో క్లాసిక్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సినిమాను రీమేక్ చేయడం అనేది పెద్ద రిస్కే. ఆ రిస్క్ తో ఓ మేరకు విజయం సాధించాడనే చెప్పాలి. అయితే.. ఆయుష్మాన్ తరహాలో నితిన్ కూడా అంధుల వ్యవహారశైలి గురించి కాస్త హోమ్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. అది చేయకపోవడం వలన అతడి నటనలో సహజత్వం మిస్సైయింది. మిగతా సన్నివేశాల్లో మాత్రం తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు.

తమన్నా ఈ సినిమాలో మంచి సర్ ప్రైజ్ ప్యాకేజ్. ఆమె నటించగలదు అని అందరికీ తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ లో అదరగొట్టింది. టబు స్థాయికి మ్యాచ్ చేయగలగడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. తమన్నా 100% ఇచ్చి, సిమ్రాన్ క్యారెక్టర్ లో అలరించింది. ఆమె ఓన్ డబ్బింగ్ క్యారెక్టర్ కి ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

నభా నటేష్ క్యారెక్టర్ కి సరిపోయింది కానీ.. క్యారెక్టర్ ని ఓన్ చేసుకోలేదు. ఆమె హావభావాలు, ఎమోషన్స్ చాలా అసహజంగా ఉన్నాయి. క్యారెక్టర్ ను ఇంకాస్త బాగా అర్ధం చేసుకొని ఎమోషన్స్ పలికించి ఉంటే బాగుండేది.

నరేష్ కు ఇంకాస్త స్కోప్ ఉన్నప్పటికీ.. పరిమిత సన్నివేశాలు కావడంతో ఆయన పాత్ర పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. జిషు సేన్ గుప్తా, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు మహతి నేపధ్య సంగీతం ఆకట్టుకొనే స్థాయిలో లేదు. పాటలు బాగున్నాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ పరంగా ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే.. టెక్నీకల్లీ స్ట్రాంగ్ ప్రెజన్స్ అవసరమున్న సినిమా ఇది. నిజానికి ట్రైలర్ లోనే కథ ఏమిటి? అనే విషయం తెలిసిపోతుంది. అయితే.. స్క్రీన్ ప్లే & టెక్నీకాలిటీస్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఆ స్కోప్ ను చిత్రబృందం సరిగా వినియోగించుకోలేదు. ముఖ్యంగా.. కెమెరా వర్క్ చాలా నార్మల్ గా ఉంది. చాలా బెటర్ అవుట్ పుట్ ఇవ్వొచ్చు. ఫ్రేమ్స్ & టింట్ విషయంలో బోలెడు ప్రయోగాలు చేయొచ్చు. కానీ.. అవేవీ సినిమాలో కనిపించలేదు.

దర్శకుడు మేర్లపాక గాంధీ.. మంచి క్యాస్టింగ్ తోనే సగం విజయం సాధించాడు. స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోలేదు కానీ.. హిందీ వెర్షన్ లో సమాధానాలు చెప్పకుండా వదిలేసిన ప్రశ్నలకు.. జవాబు చెప్పే ప్రయత్నం చేసాడు. ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్ చేసాడు. ఆ విషయంలో మేర్లపాక గాంధీ మంచి పని చేసాడనే చెప్పాలి. అయితే.. నేటివిటీ మిస్సయ్యింది. హిందీ వెర్షన్ ను చూసినవాళ్లకు పెద్దగా తేడా కనిపించదు. కథను తెలుగీకరించినప్పుడు.. నేటివిటీని ఎందుకు కేర్ చేయడం లేదు అనేది పెద్ద ప్రశ్న. ఈమధ్యకాలంలో వచ్చిన రీమేకులన్నీ దాదాపుగా ఇదే ఫార్మాట్ లో ఉండడం బాధాకరం. అయితే.. “మ్యాస్ట్రో” ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విజయం సాధించిందనే చెప్పాలి. అలాగే.. దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా.

విశ్లేషణ: “మ్యాస్ట్రో” ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ అయినప్పటికీ.. చక్కని క్యాస్టింగ్ ఉంది. మేర్లపాక గాంధీ డీల్ చేసిన విధానం బాగుంది. సో, ఒరిజినల్ వెర్షన్ చూసినా, చూడకపోయినా.. “మ్యాస్ట్రో”ను హాట్ స్టార్ లో ఒకసారి గ్యాపీగా చూసేయొచ్చు. థియేటర్లలో రిలీజయ్యి ఉంటే.. మంచి హిట్ అయ్యుండేది కూడా.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Share.