మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండో సినిమాతోనే రికార్డులు నెలకొల్పారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్ చేసిన మగధీర భారీ కలక్షన్స్ రాబట్టింది. తొమ్మిదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 136 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ హంగామా సృష్టిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు జపాన్‌లో రీసెంట్ గా 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, సుబ్బరాజులకు జపనీయులు బాగా సత్కరించారు. తెలుగుసినిమాలకు అక్కడ ఆదరణ ఉండడంతో రాజమౌళి తెరకెక్కించిన మగధీరని జపాన్ భాషలో డబ్ చేసి విడుదల చేశారు.
ఈ చిత్రం కూడా జపాన్ ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రిలీజైన పది రోజుల్లోనే 17 కోట్లు రాబట్టింది. సినిమా తమకెంతో నచ్చిందని జపనీయులు దర్శకధీరుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఆ సినిమాలోని ప్రధాన పాత్రల వేషాలు వేసుకొని ఫోటోలను ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ పరిధి విదేశాల్లోనూ విస్తరించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.