బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో, హై టెక్నీకల్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతోన్న సినిమా 2.0. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో గా నటిస్తున్న ఈ చిత్రం 450 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. కమర్షియల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 27 న రిలీజ్ చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం స్పష్టం చేశారు. దీంతో అటు కోలీవుడ్, టాలీవుడ్ ఫిలిం మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్స్ పై సర్దుబాటు చేసుకున్నారు. అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమా నిర్మాతల పరిస్థితి అర్ధం కావడం లేదు.
రజనీకి తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. అతని సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం ఖాయం. అదే రోజు మహేష్ బాబు కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను, వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న నా పేరు సూర్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలకే థియేటర్స్ కొరత ఏర్పడేలా ఉంటే ఇప్పుడు రజనీ 2 .0 వచ్చింది. రజనీతో పోటీకి దిగాలా ? లేకుంటే వెనక్కి తగ్గాలా ? అనేది ప్రస్తుతం మహేష్, బన్నీ యూనిట్ మధ్య ఉన్న ప్రశ్న. అయితే రజనీ 2 .0 రిలీజ్ డేట్ లో మార్పులు జరగవచ్చని, అందుకే ఇప్పుడే తమ సినిమాల విడుదల తేదీలపై నిర్ణయం తీసుకోవాల్సిన పనిలేదని ఆయా సినిమాల నిర్మాతలు భావిస్తున్నట్టు తెలిసింది.