స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం రావడం ఎంత కష్టమో, వచ్చిన అవకాశాన్ని హిట్ గా మలచి ప్రశంసలు అందుకోవడం అంతే కష్టం. ఒక వేళ మూవీ అటో ఇటో అయ్యిందంటే కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక ఉదాహరణ. జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతున్న ఆయన కెరీర్ కి మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం ఎంత పెద్ద బ్రేక్ వేసిందో తెలిసిందే. ఆ మూవీ విడుదలైన నాలుగేళ్లకు గానీ ఆయనకు నారప్ప మూవీ చేసే అవకాశం రాలేదు.
ప్రస్తుతం మహేష్ తో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న పరుశురామ్ పొజిషన్ కూడా అదే. మహేష్ తో మూవీ చేసే అవకాశం వచ్చిందని మురిసిపోతే సరిపోదు. ఆ మూవీ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా, ఆశించిన ఫలితం రాకున్నా కెరీర్ ప్రమాదంలో పడుతుంది. 12ఏళ్ల కెరీర్ లో పరుశురాం చేసింది కేవలం ఆరు సినిమాలు. వీటిలో సోలో హిట్ కాగా, గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మిగతా నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడం విశేషం.
కాబట్టి ఈ దర్శకుడు సక్సెస్ రేటు తక్కువే అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, మహేష్ మూవీ తరువాత మరో లెక్క. మహేష్ తో ఆయన చేస్తున్న సర్కారు వారి పాట భారీ విజయం సాధిస్తే మరో స్టార్ హీరో నుండి ఆయనకు ఆఫర్ రెడీగా ఉంటుంది. లేదంటే ఏ స్టార్ హీరో ఆయన్ని దగ్గరకు రానివ్వరు . పరుశురాం తిరిగి టు టైర్ హీరో కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి సర్కారు వాటి పాట విజయం సాధించడం అనేది పరుశురాం కి చాలా అవసరం. మరి ఈ సదావకాశాన్నీ పరుశురాం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.