సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ హీరో మాత్రమే కాదు. రియల్ హీరో కూడా. ఈ విషయాన్నీ గతంలో అతను చేసిన పనులు చాటి చెప్పాయి. శ్రీమంతుడు సినిమాలో మహేష్ సందేశం ఇవ్వడమే కాదు.. తాను కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మరో ఘటన మహేష్ రియల్ హీరో అని ప్రపంచానికి మరోసారి చాటింది. వివరాల్లోకి వెళితే.. తనీష్ అనే అబ్బాయి… కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. అతని తల్లిదండ్రులు వైద్యం కోసం ఉన్న ఆస్తినంతా కరిగించారు. ఇక ఏమి చేయాలిరా దేవుడా.. అని బాధపడుతున్న సమయంలో మహేష్ వారికీ దేవుడయ్యాడు. తన బిడ్డ గురించి మహేష్ కి చెప్పగానే చలించిపోయారు.
వైద్యం కోసం భారీ మొత్తంలో ఆర్ధిక సాయం చేశారు. దీంతో తనీష్ తల్లిదండ్రులు కొడుకుకి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సాయం.. ఇప్పుడు హాట్ న్యూస్ అయింది. క్యాన్సర్ బాధిత చిన్నారి, వారి కుటుంబ సభ్యులు నిన్న మహేష్ బాబుని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్లు అందుకుంటున్నాయి. నెటిజనులు మహేష్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.