హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ది లయన్ కింగ్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ముఫాసాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా, తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ అందించాడు. ఈ సమాచారం బయటకొచ్చినప్పటినుంచి తెలుగు అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆకట్టుకోగా, మహేష్ బాబు వాయిస్‌తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. మహేష్ స్వరంలో ముఫాసా పాత్రకు ప్రాణం పోస్తుండటంతో, అభిమానుల్లో ఒక రకమైన మేనియా మొదలైంది. రాజమౌళి ప్రాజెక్ట్ కు ఇంకొన్ని సంవత్సరాలు టైమ్ పట్టే అవకాశం ఉండటంతో, ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్ మహేష్ అభిమానులకు ఓ పండగలా మారింది. మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని తమ హీరో సినిమా స్థాయిలోనే సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం వంటి ప్రధాన థియేటర్లలో స్పెషల్ షోలను ప్లాన్ చేస్తుండగా, థియేటర్ ఎదుట భారీ కటౌట్లు, బాణసంచా, డప్పు దరువులు సన్నాహాలు జరుగుతున్నాయి. మహేష్ సినిమా రిలీజ్ రోజున జరిగే రచ్చని ఇప్పుడు ముఫాసా కోసం అభిమానులు పునరావృతం చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ టికెట్ అమ్మకాలు ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. సుదర్శన్ థియేటర్‌లో 20వ తేదీ ఉదయం 8 గంటలకు ప్లాన్ చేసిన స్పెషల్ షోకి టికెట్లు ఓపెన్ చేయగానే సెకన్లలోనే హౌస్‌ఫుల్ అయిపోయాయట.
మహేష్ బాబు వాయిస్ ఒవర్ ఉండటంతో ముఫాసా చిత్రం కుటుంబ ప్రేక్షకులకు చేరువ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, హాలీవుడ్ బొమ్మకి తెలుగులో మహేష్ బాబు మ్యాజిక్ కలవడంతో, సినిమా విడుదల రోజున తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన హంగామా కనిపించడం ఖాయం. ఇక ఈ హైప్‌తో సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.