ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) అనారోగ్యంతో కన్నుమూశారు. కేరళలో త్రివేండ్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం (ఆగస్టు 9)న తుదిశ్వాస విడిచారు. పదేళ్ల క్రితం ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్పటినుండి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడిన ఆమెకి ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సహాయం అందించారు. ఇదిలా ఉండగా..
కొన్ని వారాల క్రితం ఆమెకి కరోనా సోకడంతో మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. న్యుమోనియాతో పాటు రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గడంతో కొన్ని రోజుల పాటు కేరళలోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శరణ్య ట్రీట్మెంట్ తీసుకుంది. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం కన్నుమూసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం శరణ్యను గుర్తు చేసుకుంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. కేరళ వరదల సమయంలో ఆమె చాలా మందికి సాయం చేశారని.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆలాంటి వ్యక్తి మరణం బాధిస్తోందని అన్నారు. ‘మంత్రకోడి’, ‘సీత’, ‘హరిచందనం’ ఇలా పలు మలయాళ టీవీ సిరియల్స్ తో బాగా పాపులర్ అయిన శరణ్య కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది.