మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “మనసుకి నచ్చింది”. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జెమిని కిరణ్ నిర్మించారు. తల్లి విజయనిర్మల స్థాయిలో దర్శకురాలిగా మంజుల నిలదొక్కుకోగలిగిందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : సూరజ్ (సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తూర్) ఒకే కుటుంబానికి చెందినవారు. వారిద్దరి స్నేహాన్ని చూసి ప్రేమగా భావించి వాళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయిస్తారు ఇరు కుటుంబాల పెద్దలు. అయితే.. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదని స్నేహితులతో కలిసి గోవా పారిపోతారు. గోవా వెళ్ళాక సూరజ్ అక్కడ నిఖిత (త్రిధా చౌదరి)పై మనసు పారేసుకొంటాడు. నిత్య కూడా అభయ్ (అరుణ్ ఆదిత్) మీద మనసు పడుతుంది. ఇలా ఒకటవ్వాల్సిన వాళ్ళిద్దరూ వేరే వాళ్లమీద మనసుపడడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అయితే.. మైండ్ చెప్పిన మాట విని సూరజ్-నిత్యలు వేరే వాళ్ళని ఇష్టపడ్డారే కానీ, వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం వేరే అర్ధం చేసుకొంటారు. చివరికి వాళ్ళిద్దరూ కలిశారా లేదా? కలవడం కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లేమిటి ? అనేది “మనసుకి నచ్చింది” కథాంశం.
నటీనటుల పనితీరు : గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించడం వల్లనో లేక తన మునుపటి చిత్రం “నక్షత్రం” ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటకి రాకపోవడం వల్లనో తెలియదు కానీ.. సరదాగా సన్నివేశాల్లో ఎప్పట్లానే పర్వాలేదనిపించుకొన్న సందీప్ కిషన్ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం దారుణంగా తేలిపోయాడు. ముఖ్యంగా నాజర్ తో కాంబినేషన్ సీన్ లో సందీప్ నటన చూసి ఆడియన్స్ కూడా నవ్వడం గమనార్హం. అమైరా దస్తూర్ అందంగా కనిపించింది. నటనపరంగానూ పర్వాలేదనిపించుకోంది. అయితే.. ఆమె చేత నటింపజేయడం కంటే ఏవో యోగా & మేడిటేషన్ వీడియోలు చేయించినట్లుగా సన్నివేశాలు క్రియేట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్ధం కాదు. ఇక మరో హీరోయిన్ గా నటించిన త్రిధా చౌదరి క్యారెక్టర్ ఎందుకుందో దర్శకురాలు మంజులగారికే ఐడియా ఉండాలి. కేవలం బికినీ షాట్స్ కోసమే అమ్మడిని తీసుకొన్నట్లుగా స్లోమోషన్ షాట్స్, ఒకటే కలర్ బికినీలో నాలుగు సీన్లు తీసేసి ఆమె పాత్రని ముగించారు. నాజర్ తాతయ్య పాత్రలో ఆహార్యంతో ఆకట్టుకొన్నా.. ఆయన పాత్రకి సరైన డెప్త్ లేకపోవడంతో ఆడియన్స్ కి సింక్ అవ్వలేదు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, అభయ్, అరుణ్ ఆదిత్ లాంటి నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసినప్పటికీ.. వాళ్ళ క్యారెక్టర్స్ లో క్లారిటీ మాత్రమే కాక ఎస్టాబ్లిష్ మెంట్ కూడా లేకపోవడంతో ఎవరికీ కనెక్ట్ అవ్వరు.
సాంకేతికవర్గం పనితీరు : రవి యాదవ్ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆయన ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంది. కొన్ని అనవసర గ్రాఫిక్ షాట్స్ ను పక్కనపెట్టేస్తే ఈ సినిమాలో ఆయన కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. రధన్ పాటలు బాగున్నాయి. అయితే.. గ్యాప్ లేకుండా వెంటవెంటనే వచ్చేయడంతో ఆ పాటలని ఎంజాయ్ చేయలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయిమాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా తప్పితే పెద్దగా మనసుకి నచ్చలేదు.
ఇక దర్శకురాలు మంజుల ఘట్టమనేని “నువ్వే కావాలి, ఆనందం, సొంతం” లాంటి సినిమాలను మరీ ఎక్కువగా చూసేసిందో లేక అసలు ఆ సినిమాలను చూడలేదో కానీ.. స్టోరీ ఫార్మాట్ మాత్రం సేమ్ ఉంది. ఇక ఆ కథను నడిపించిన కథనం అయితే మరీ పేలవంగా ఉంది. థియేటర్లో కూర్చుని రెండున్నర గంటల సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఏదో అయిదారు గంటల “యోగా & మేడిటేషన్” క్లాస్ కి సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలిగేలా చేసింది స్క్రీన్ ప్లే & రన్ టైమ్. చెప్పాలనుకొన్న అంశం చిన్నదైనప్పుడు, చెప్పే విధానం కొత్తగా ఉండాలి లేదా ఎంటర్ టైనింగ్ గా అయినా ఉండాలి. అదేం కాకుండా నా “మనసుకి నచ్చింది” తీస్తానని మంజుల ఘట్టమనేని అంటే.. ఆడియన్స్ చాలా నీట్ గా మా “మనసుకి నచ్చింది” చేస్తాం అంటూ థియేటర్ల నుంచి వాకౌట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
విశ్లేషణ : సినిమాటోగ్రఫీ తప్ప సినిమా మొత్తానికి చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేని ఈ చిత్రాన్ని చూడాలంటే సహనం, ఓపికతో పాటు చేతిలో ఒక పాప్ కార్న్ ప్యాకెట్ తప్పకుండా ఉండాల్సిందే. ఇక మీ ఇష్టం.