క్యాస్టింగ్ కౌచ్… సినిమా ఇండస్ట్రీలో ఈ మాట గురించి చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. నిజానికి ఇదేమీ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. ఈ మాట అయితే అప్పుడుప్పుడు వింటూ ఉంటాం. తాజాగా ఇదే మాట మళ్లీ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ట్రోల్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాల గురించి కూడా మాట్లాడింది.
కెరీర్ ప్రారంభంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాని మంచు లక్ష్మీ చెప్పింది. మోహన్ బాబు కూతురిగా… సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగింది మంచు లక్ష్మి. అలాంటి ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఏంటి అనే ప్రశ్నకు మీ మనసులో రావొచ్చు. నిజానికి ఆ ప్రశ్న ఆమె కూడా అనుకుందట. క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతూ… ఇదేదో సినిమా పరిశ్రమలో మాత్రమే లేదు. ప్రతి ఇండస్ట్రీ, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది.
బ్యాంకింగ్, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని మంచు లక్ష్మి చెప్పింది. బాడీ షేమింగ్, ట్రోల్స్ అయితే అందరికీ ఎదురవుతుంటాయి. ఎలా ఉన్నా ట్రోల్ చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు అని చెప్పిన లక్ష్మీప్రసన్న… తన ఫ్రెండ్స్ చాలామంది వాటి గురించి చెబుతుంటారు అని చెప్పింది. అయితే ఇలాంటివాటిని పట్టించుకోకూడదు అని అంది. ఎప్పుడైనా మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అని మంచు లక్ష్మీ సూచించింది.
జీవితం చాలా చిన్నది, అనుకున్నవి చేసేయాలి, కోరుకున్నది సాధించాలి, సంతోషంగా ఉండాలి, ఎంతో సాధించాలి అంటూ జీవితం గురించి చైతన్యం కలిగించేలా మాట్లాడింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే… ట్రోలింగ్, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి మన జీవితంలో మనల్ని ఆపకూడదు అని చెప్పింది మంచు లక్ష్మీప్రసన్న. ప్రస్తుతం మంచు లక్ష్మీ తమిళ, మలయాళ పరిశ్రమల్లో నటిస్తోంది. వీటితోపాటు తండ్రితో కలసి లక్ష్మీ ఓ సినిమాలో నటిస్తోంది. తండ్రితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమెకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.