బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ (Hema) ఉన్నారా? లేదా? ఇదే ప్రశ్న అసలు.. ఆమె ఉందని, దానికి తగ్గ ఆధారాలున్నాయని బెంగళూరు పోలీసులు కూడడా చెప్పారు కదా అంటారా. మీరు అన్న మాట కరెక్టే. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఇంకా ఆమె దోషి కాదు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీటు చేశారు. దీంతో ఇన్ని ఆధారాలున్నా.. ఎందుకు ఇలా అంటున్నాడు అనే చర్చ మొదలైంది.
‘‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై ఇలా లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదు. వ్యక్తిగతంగా ఆమెను దూషించడమూ తగదు. నిర్ధరణ లేని, ఇంకా ఎవరూ ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి’’ అని పేర్కొన్నాడు మంచు విష్ణు. అలాగే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుందని, హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ ఆమె తగిన చర్యలు తీసుకుంటుందని విష్ణు చెప్పారు.
అప్పటివరకు సంచలనాల కోసం హేమపై నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అని ఎక్స్‌లో విష్ణు తన పోస్టులో రాసుకొచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయగానే.. హేమ పేరు బయటకు వచ్చింది. అయితే వెంటనే ఆమె ‘నేను ఆ పార్టీకి హాజరుకాలేదు’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. దానిపై బెంగళూరు పోలీసులు వివరణ ఇచ్చారు. ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని పోలీస్ కమిషనర్ దయానంద్ వివరించారు.
అయితే ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు విలేకర్ల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు. ఈ కేసులో హేమకు నోటీసులు కూడడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంత జరిగినా ఇంకా విష్ణు ఆధారాలు కావాలని అడగడం ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది.