ప్రస్తుతం ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయం చర్చనీయాంశంగా మారింది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమా. సీవీఎల్ నరసింహారావు లాంటి వారు పోటీ పడుతున్నారు. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తన ఎజెండాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంచి విష్ణు ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
‘మా’ బిల్డింగ్ ఒక్కటే తన ఎజెండా కాదని.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు. ఇక కరోనా సమయంలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్ సినీ కార్మికులకు ఎంతో సహాయం చేశారని విష్ణు పేర్కొన్నారు. కష్ట సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయమని.. కానీ దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని విష్ణు అన్నారు. ఎదుటి వాళ్లకు ఆదర్శంగా ఉండాలని.. మనల్ని నమ్ముకున్న వాళ్లకు అండగా ఉండాలనేదే తన ఎజెండా అని చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కపెట్టాల్సిన చాలా మంది తాను చేసిన సాయం వలనే బయట తిరుగుతున్నారని విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎంతమందికి సాయం చేశాననే విషయం చెప్పనని. కొంతమంది ఊచలు లెక్కపెట్టకుండా ఉన్నారంటే ఎవరివల్ల అనే ప్రశ్న వాళ్లనే అడగాలని చెప్పుకొచ్చారు. అండర్ వేర్లతో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే.. తెల్లారి 4:30 గంటలకు సర్ది చెప్పి బయటకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటి వాళ్లు శృతిమించితే.. పేర్లు బయటపెడతానంటూ చెప్పుకొచ్చారు.