మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ నటులుగా నిలదొక్కుకోలేకపోయారు. ఈ ఇద్దరు హీరోలు కెరీర్ ఆరంభంలో ఎంతగానే ఇబ్బంది పడ్డారు. మధ్యలో ఒకట్రెండు హిట్లు వచ్చినప్పటికీ.. ఆ తరువాత ఆ హిట్స్ ను కొనసాగించలేకపోయారు. ఐదారేళ్ల నుంచి ఈ ఇద్దరు హీరోల నుంచి సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ బిజినెస్ పరంగా మాత్రం వీరు దూసుకుపోతున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో పాటు..
కొత్తగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టి గత రెండు దశాబ్దాల్లో చాలా సినిమాలే నిర్మించింది మంచు ఫ్యామిలీ. కానీ వాటిలో రెండు, మూడు సినిమాలు తప్ప ఏవీ పెద్దగా ఆడలేదు. సినిమాల పరంగా చూసుకుంటే మంచి వారికి నష్టాలే తప్ప లాభాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి విష్ణు కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ బేనర్ మీద అతను శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
మరోపక్క విష్ణు మరో సినిమా వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. ‘అవా'(AVA) ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీను విష్ణు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లు, బడ్జెట్ లో సినిమాలు తీయబోతున్నారట. కేవలం ఓటీటీ కంటెంట్ కోసమే నెలకొల్పుతున్న సంస్థ ఇది. కొత్త నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించడంతో పాటు ఫ్యూచర్ లో ఓటీటీలదే హవా అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిపోయింది. త్వరలోనే ఈ సంస్థను గ్రాండ్ గా మొదలుపెట్టి ఒరిజినల్ కంటెంట్ ను చిత్రీకరించబోతున్నారు.