ఇప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్ వంటి ఇండస్ట్రీల్లో 1000 కోట్ల వసూళ్ల సినిమా అనేది కామన్ అయ్యింది. RRR, బాహుబలి 2 (Baahubali 2), దంగల్ వంటి సినిమాలు ఇప్పటికే ఆ మార్క్ ను దాటి మరింత పెద్ద లెక్కల్లో ఆడేశాయి. అయితే కోలీవుడ్ మాత్రం ఇప్పటికీ 1000 కోట్ల మార్క్ ను అందుకోలేదు. పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) వంటి మణిరత్నం (Mani Ratnam) చిత్రం మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా 500 కోట్ల వద్దే ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ (Thug Life) సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్న సమయంలో మణిరత్నాన్ని ఓ జర్నలిస్టు నేరుగా 1000 కోట్ల సినిమా గురించి అడిగాడు. అందుకు ఆయన స్పందన ఊహించని విధంగా ఉండడం వైరల్ అవుతోంది. “నాకూ 1000 కోట్లు వసూలు చేసే సినిమా తీయడమనేది సాధ్యం కాదని ముందే చెప్పాలి. నా దృష్టిలో సినిమా బాగుందా? ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చిందా? అనే అంశాలే ముఖ్యం” అని స్పష్టం చేశారు.
తమ కాలంలో దర్శకులు ఒకరిని మించి ఒకరు మంచి సినిమాలు తీయాలని పోటీ పడేవారని మణిరత్నం గుర్తు చేశారు. “ఒకప్పుడు హిట్-ఫ్లాప్ అనే మాటలే వినిపించేవి. ఇప్పుడు మాత్రం వసూళ్లు, నంబర్లు మీదే ఎక్కువ చర్చ. ఇది తప్పు అననన్నా, కానీ సినిమా పరంగా గొప్పదేంటి అన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది” అని అన్నారు. అట్లీ (Atlee Kumar), శంకర్(Shankar) , లోకేష్ (Lokesh Kanagaraj) వంటి దర్శకులు తమ స్థాయిలో విభిన్న చిత్రాలు తీస్తున్నా.. బాక్సాఫీస్ లెక్కల కోసం చేసే ప్రయత్నాలపై మణిరత్నం అసహనం వ్యక్తం చేశారు.
“లెక్కలేసుకుని సినిమా తీయడం నా స్టైల్ కాదు. నాకు ఒక్క దృష్టి, మంచి కథ చెప్పాలి. కమర్షియల్ రిజల్ట్ దాని ఫలితం. దాని కోసం కాదు” అంటూ తన ఫిలాసఫీని స్పష్టం చేశారు. మొత్తానికి 1000 కోట్లు అనే లెక్క మణిరత్నం లెక్కల్లో లేదు. ఆయన దృష్టిలో మంచి కథ, ప్రేక్షకుడి హృదయంలో మిగిలిపోయే సినిమా తీసినప్పుడే విజయం. వసూళ్లు రాకపోయినా, మిగిలే సినిమా కావాలన్నదే ఆయన లక్ష్యం. ఇవే మణిరత్నాన్ని మిగతావారితో భిన్నంగా నిలిపే బలమైన కారణాలు.