కలల ప్రాజెక్ట్ అంటే.. ఎప్పుడూ లేట్ అవుతుంది. భారీ ఆశలు, ఊహలు, అంచనాలతో ఆ సినిమాను తెరకెక్కిస్తుంటారు దర్శకులు. అలా మణిరత్నం కలల సినిమా ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా గురించి ఆయన ఎప్పటి నుండో ఆలోచిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు విడుదలై తమిళనాట మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విషయంలో జరిగిన ఆలస్యం ఒకందుకు మంచిదే అంటున్నారు మణిరత్నం. ఆయన అలా ఎందుకు అన్నారంటే?
‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌లో తొలి భాగంగా ‘పీఎస్ 1’ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న విడుదలైంది. నిజానికి ఈ సినిమాను ఆయన 1994లోనే రూపొందిద్దాం అనుకున్నారు. కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అప్పుడు కాలేదు. ఆ తర్వాత మళ్లీ 2011లో మరోమారు ప్రయత్నించారు. ఈ సారి కూడా తొలి విడతలాగే సినిమా పట్టాలెక్కలేదు. కానీ మూడో ప్రయత్నంలో సినిమా పూర్తిచేయగలిగారు. తొలి పార్ట్ విడుదల చేశారు.
ఈ లేట్ గురించి దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడుపోతోంది. ప్రజల హృదయానికి ఈ పుస్తకం అంతగా చేరువైందన్నమాట. ఈ నవల అంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకే సినిమాగా తీయాలనుకున్నా. దీని కోసం చాలా కాలం వేచి చూశాను. కానీ రెండు సార్లు వీలుపడలేదు. అలా ఆలస్యం అవ్వడం కూడా సినిమాకు మంచే అయ్యింది అని కామెంట్ చేశారాయన.
దానికి కారణం కూడా చెబుతూ.. రెండుసార్లు సినిమా చేద్దాం అనుకున్నప్పుటి సాంకేతికతకి, ఇప్పటి టెక్నాలజీకి చాలా తేడా ఉంది. అప్పటికంటే ఇప్పుడు సినిమా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. దాని వల్ల ఈ సినిమాను సాంకేతికంగా ఎలాంటి రాజీ లేకుండా చేయగలిగాం అని చెప్పారు మణిరత్నం. ఐదు భాగాలున్న ఆ నవలను రెండు భాగాల సినిమాగా రూపొందిస్తున్నారు. రెండో భాగంగా తొమ్మిది నెలల తర్వాత వస్తుంది అంటున్నారు.