Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?
- January 20, 2026 / 07:04 PM ISTByPhani Kumar
దర్శకుడు మారుతీ(Maruthi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఈరోజుల్లో’ అనే రూ.50 లక్షల సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ‘బస్ స్టాప్’ ‘కొత్త జంట’ ‘భలే భలే మగాడివోయ్’ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ ని అందించి టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. తర్వాత ‘బాబు బంగారం’ సినిమాతో బిగ్ లీగ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు.
Maruthi
వెంకటేష్ ఇమేజ్ ను మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. దీంతో మారుతీ కూడా వాస్తవంలోకి వచ్చి.. శర్వానంద్ తో ‘మహానుభావుడు’ చేశాడు. అది బాగానే ఆడింది. తర్వాత నాగ చైతన్యతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా పర్వాలేదనిపించింది. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘ప్రతిరోజూ పండగే’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

అయితే మళ్ళీ గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ అనే పెద్ద సినిమా… పైగా మాస్ సినిమా చేశాడు. అది పెద్ద ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ప్రభాస్ వంటి పెద్ద హీరో పిలిచి ‘ది రాజాసాబ్’ అనే పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. బయ్యర్స్ కి ఆల్మోస్ట్ రూ.80 కోట్లు నష్టం మిగిల్చేలానే ఉంది. ఈ సినిమా ఫలితంతో ప్రభాస్ కెరీర్ పై ఎటువంటి ఇంపాక్ట్ పడదు.
అతని లైనప్ బాగానే ఉంది. కానీ మారుతీకి ఇప్పుడు పెద్ద హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. మారుతీ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది అని ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చెప్పారు. ఇప్పుడు మారుతీని ఆయన పట్టించుకోవడం కష్టం. అలాగే అల్లు అర్జున్.. మారుతీకి బెస్ట్ ఫ్రెండ్. అతను ఛాన్స్ ఇస్తాడా అంటే.. ‘ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడో ఉన్నాడు’ అని స్వయంగా మారుతీనే చెప్పారు.
మరి మారుతీకి ఇప్పుడు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు? అంటే.. ప్రస్తుతానికి సమాధానం లేదు. మారుతీ నెక్స్ట్ సినిమా వరుణ్ తేజ్ తో అని కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ పోస్ట్ చేశాయి. ఆ రూమర్ ఏమీ వైరల్ కాలేదు. అయినప్పటికీ ఈ రోజు మారుతీ పీ ఆర్ టీం దానికి రియాక్ట్ అయ్యి.. అది అబద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక్కటి మాత్రం నిజం. మారుతీకి బన్నీ వాస్, అల్లు అరవింద్ వంటి పెద్ద బ్యాకప్ ఉంది. కాబట్టి…సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య వంటి మిడ్ రేంజ్ హీరోలు సెట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.














