మనకు ప్రాణం పోసి… మన సంతోషంలో తమ సంతోషాన్ని వెతుకొంటూ మనకు వెన్నంటి నిలిచి వెలకట్టలేని ప్రేమకు నిదర్శనంగా నిలిచేది అమ్మ.. మాతృదినోత్సవం సందర్భంగా ముందుగా మాతృమూర్తులందరికి శుభాకాంక్షలు
కొణిదెల కుటుంబానికి ఉన్న ఆస్తి అనురాగం… హోదా మమకారం. ఈ రెండింటి వెనక ఉన్న శక్తి అంజనాదేవి. 10 మంది హీరోలున్న కుటుంబానికి పెద్ద. ‘మదర్స్ డే’ సందర్భంగా– మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు నాగబాబు, చెల్లెళ్లు మాధవి, విజయ… అమ్మతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
అవే ఆస్తిపాస్తులు మనకు బంధాలు, బాంధవ్యాలు ఎనలేని ఆస్తిపాస్తులు. ‘భౌతికంగా ఎన్ని వచ్చాయి?’ అనే వాటికన్నా.. భౌతికంగా కొలవలేని ఇవే ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు ఆసరా ఇచ్చే భుజం కన్నా గొప్పదేమీ ఉండదు. అలా ఎంతో మందికి ఆసరా ఇవ్వగలిగినట్లు చేసింది అమ్మే! మేము ఆ చెట్టు కొమ్మలమే! ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మే కారణమని బ్రదర్స్ అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ పడిన కష్టం తలచుకుంటే– ఇప్పటికీ గుండెలు అవిసిపోతాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనేదాకా బండి చక్రంలా తిరుగుతూ ఉండేది. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే! పనిమనిషిని కూడా పెట్టుకొనేందుకు వెసులుబాటు లేదు. దీంతో పాటు నాన్న ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకొనేవారు కాదు. ఒక వైపు శారీరక శ్రమ, మరో వైపు మానసిక సంఘర్షణ… ఇదంతా నా కళ్లారా చూశాను. తన కష్టాలన్నీ నాతో చెప్పుకొనేది.. బహుశా తరువాత కాలంలో మహిళల సమస్యల పట్ల చాలాసార్లు స్పందించడానికి కారణం ఇదే కావచ్చు.
నాగబాబు మాట్లాడుతూ..అమ్మ నాకు ఎప్పుడూ సలహాలు ఇవ్వదు. కానీ అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది. నాకు తను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్.. కలిసినప్పుడు ఇచ్చే హగ్. తను చదువుకోలేదు. బయట ప్రపంచాన్ని చూడలేదు. కానీ అందరం కలిసి ఉన్నామంటే మాత్రం అమ్మే కారణం. మాకు అప్పుడప్పుడు గొడవలు వస్తాయి. అమ్మ దగ్గరకు వెళ్తే అన్నీ పోతాయి. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే మా అందరినీ పాజిటివ్‌గా కలిపే మమతల వైఫై అమ్మే అని అన్నారు..
మాధవి మాట్లాడుతూ.. ఒక దశలో.. నానుంచి అందరూ నుంచి వేరుపడిపోయిన ఫీలింగ్ వచ్చి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అప్పుడు అమ్మ– ‘‘ప్రపంచంలో నీకు ఎవరు ఉన్నా, లేకపోయినా.. నేను ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. ఎవరూ నీ తరపున లేకపోయినా నేను ఉంటాను. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు’’ అని చెప్పింది. నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. నేను ఏదైనా చేయగలననే ఫీలింగ్ వచ్చింది.
మాధవి మాట్లాడుతూ.. ఆ జనరేషన్‌లో అమ్మలాంటివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మ వల్లే మా అందరికీ స్వతంత్రంగా ఉండే వ్యక్తిత్వాలు వచ్చాయి. మా అమ్మ స్ట్రాంగ్ లేడీ మాత్రమే కాదు. చాలా ప్రాక్టికల్ కూడా.