“పెళ్ళిచూపులు” చిత్రంతో సూపర్ హిట్ అందుకోవడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న రాజ్ కందుకూరి తన తదుపరి ప్రయత్నంగా మరో యువ ప్రతిభాశాలిని పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “మెంటల్ మదిలో”. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించిన వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఇప్పటికే పలు ప్రివ్యూ షోస్ ద్వారా భీభత్సమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమాలో అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటున్న ఆ రేంజ్ కంటెంట్ ఏముందో చూద్దాం..!!
కథ : అన్నంలో పప్పు కలుపుకోవాలో, సాంబార్ కలుపుకోవాలో అనే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అయిపోయే డబుల్ మైండెడ్ అబ్బాయి అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు). ఈ కన్ఫ్యూజన్ కి తోడు అమ్మాయిలతో మాట్లాడడం అంటే మహాభయం. దాంతో చిన్నప్పట్నుంచి అమ్మాయిలను కన్నెత్తి చూడడం కాదు కదా కనీసం వారి దరిదాపులకు కూడా వెళ్లడు. ఇలాగే ఉంటే కొడుకు స్థితి ఏమైపోతుందో అని భయపడి పెళ్లి చేయాలనుకొంటాడు తండ్రి (శివాజీ రాజా).
అసలే సిగ్గరి అయిన అరవిందకృష్ణ పెళ్ళిచూపుల్లోనూ అదే విధంగా ప్రవర్తించడంతో.. అమ్మాయిలేవ్వరూ అతడ్ని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడరు. ఇక ఆఖరి ప్రయత్నంగా స్వేచ్ఛ (నివేదా పేతురాజ్)ను చూస్తారు అరవిందకృష్ణ కుటుంబం. చిన్నప్పట్నుంచి ఇండిపెండెంట్ మైండ్ సెట్ తో పెరిగిన స్వేచ్ఛకు పెళ్ళిచూప్పుల్లో అరవిందకృష్ణ బాగా నచ్చుతాడు. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చిన వారి ప్రయాణం పెళ్ళికి చేరుకొనేలోపు.. అరవింద కృష్ణ కన్ఫ్యూజన్ మైండ్ సెంట్ కారణంగా చిక్కులో పడుతుంది. ఇంతకీ అరవిందకృష్ణను కన్ఫ్యూజ్ చేసిన ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు? స్వేచ్ఛ తన ప్రేమను గెలుచుకోగలిగిందా? అరవిందకృష్ణ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఎలా వచ్చింది? వంటి ఆసక్తికరమైన విషయాలకు కాస్త కన్ఫ్యూజ్ చేస్తూ.. క్లారిటీతో చెప్పిన సమాధానాల సమాహారమే “మెంటల్ మదిలో” చిత్రం.
నటీనటుల పనితీరు : అరవింద కృష్ణ పాత్రలో శ్రీవిష్ణు బిహేవ్ చేశాడు. చాలా మంది యూత్ ఈ పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ కుర్రాడిగా, అమ్మాయిలంటే సిగ్గుపడే యువకుడిగా శ్రీవిష్ణు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నివేదా పేతురాజ్ తో తెలుగు తెరకు మరో మంచి నటీమణి దొరికినట్లే. అందం, అభినయం, హావభావాల ప్రదర్శన వంటి అన్నీ విషయాల్లోనూ నివేదా చూపిన పరిణితి చూసి ముచ్చటపడని ప్రేక్షకుడు ఉండడు. హీరోయిన్ అనగానే ఏదో దివి నుంచి తిరిగొచ్చిన తారలా కాకుండా, మన పక్కింటి అమ్మాయిలా కనిపించిన తీరు ఎప్పటికీ మరువలేము.
కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న శివాజీరాజా చానాళ్ళ తర్వాత ఒక పూర్తి స్థాయి పాత్రలో ఆకట్టుకొన్నారు. శ్రీవిష్ణు తండ్రి పాత్రలో హాస్యం, కంగారు, పెద్దరికం వంటి భావాలను ఆయన పలికించిన తీరు అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటుంది. సెకండాఫ్ లో సినిమా కాస్త స్లో అయ్యిందనే ఆలోచన ప్రేక్షకుడి మదిలోకి వస్తున్న తరుణంలో శివాజీ రాజా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి సంభాషణలతో వారిని మళ్ళీ సినిమాలో ఇన్వాల్వ్ చేసేస్తాడు. రేణు పాత్రలో అమృత క్యారెక్టరైజేషన్ కు తగ్గ స్థాయిలో నటన పరంగా పర్వాలేదనిపించుకొంది కానీ.. ఆహార్యం మాత్రం అల్లరి పిల్లలా కాక కాస్త వయసుడికిన మహిళలా కనిపించడం కాస్త మింగుడుపడని అంశం. సహాయక పాత్రల్లో రాజ్ మదిరాజు, కిరీటి తదితరులు అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు : ప్రశాంత్ ఆర్.విహారీ సంగీతం సినిమాకి ప్రాణమని చెప్పాలి. ఏ ఒక్క సన్నివేశంలోనూ డైలాగ్ ను డామినేట్ చేయకుండా కేవలం కథలోని ఎమోషన్ ను, సన్నివేశంలోని భావాన్ని ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేయడంలో సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారీ పూర్తి స్థాయి విజయం సాధించాడు. వేదరామన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఇండోర్ షూట్ వరకూ పర్లేదు కానీ.. అవుట్ డోర్ లో మాత్రం సరైన లెన్స్ సమకూరకపోవడం ఒక కారణమైతే.. ముంబై షూట్ లో లైటింగ్ గురించి సరైన కేర్ తీసుకోకపోవడంతో.. ఆ సన్నివేశాలు ఏదో కాస్ట్లీ షార్ట్ ఫిలీమ్ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ పనితనం గురించి చెప్పాలంటే.. ఇదివరకు పలు షార్ట్ ఫిలిమ్స్ తీసి పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకట్టుకొన్న వివేక్ “మెంటల్ మదిలో” సినిమా కోసం భీభత్సమైన కథ, కథనాలు రాసుకోకుండా.. క్యారెక్టరైజేషన్ బేస్డ్ స్టోరీని ఎంపిక చేసుకోవడం పెద్ద ప్లస్. కథ పరంగా బాలీవుడ్ సినిమాలు “కాక్ టెయిల్, శుధ్ దేశీ రొమాన్స్” సినిమాలు గుర్తొస్తాయి. అయితే.. వివేక్ కథనాన్ని కథానాయకుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో నడిపిన విధానం మాత్రం ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కాకపోతే.. హీరో తన కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటపడ్డాడు, తన జీవితభాగస్వామి సెలక్షన్ విషయంలో అతడు తెలుసుకొన్న విషయాలేమిటి? వంటివాటిపై ఇంకాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే ఆడియన్స్ పూర్తి స్థాయిలో సినిమాలో లీనమయ్యేవారు.
విశ్లేషణ : స్లోమోషన్ షాట్స్ లేకుండా, కొట్టుకోడాలు, నరుక్కోడాలు, తిట్టుకోడాలు లాంటివి లేకుండా ఒక మంచి తెలుగు సినిమాను తెలుగు ప్రేక్షకుడు చూసి చాలా ఏళ్లవుతోంది. ఆ కొరత తీర్చే చిత్రం “మెంటల్ మదిలో”. స్వచ్చమైన ప్రేమానుబంధాలు, వినసోంపైన సంగీతం, పెదవిపై చిరునవ్వును చెరగనివ్వని నటీనటుల పనితీరు కలగలిసి “మెంటల్ మదిలో” చిత్రాన్ని ఈవారం తప్పక చూడాల్సిన సినిమాగా మలిచాయి.