సినిమా టీజర్ వచ్చాక అభిమానులు దాని వ్యూస్ లెక్క ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. మిగిలినవారైతే… అందులో హీరో, హీరోయిన్ ఎలా ఉన్నారు అనే వివరాలు చూసుకుంటారు. ఏవైనా తప్పులు కనిపిస్తే వాటిని ట్రోల్ చేస్తుంటారు. చాలావరకు స్టార్ హీరో సినిమాల విషయంలో ఇదే జరుగుతూ ఉంటుంది. అందుకే దర్శకనిర్మాతలు టీజర్, ట్రైలర్ విడుదల చేసినప్పుడు… సినిమా రిలీజ్ చేసేటంత టెన్షన్ పడుతుంటారు. అయితే ‘కేజీఎఫ్ 2’ విషయంలో ప్రశాంత్ నీల్ టైమ్ ఓ చిన్న విషయం మరచిపోయారు. ఇప్పుడది అధికారుల నోటీసుల వరకు వెళ్లింది.
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. దీంతో ‘కేజీఎఫ్ 2’ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు తగ్గట్టే సినిమా టీజర్ అదరగొట్టేసింది. వంద మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతుంది. అయితే ఆ టీజర్‌లో నిబంధనలు పాటించలేదని చిత్రబృందానికి నోటీసులు వచ్చాయట. పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో ఉంటే… ఆ సీన్ దగ్గర యాంటీ టొబాకో, లిక్కర్ కాషన్ క్యాప్షన్ తప్పక వేయాల్సి ఉంటుంది. కానీ ‘కేజీఎఫ్ 2’ టీజర్‌లో క్యాప్షన్ వేయలేదంట. దీంతో బెంగళూరు యాంటీ టొబాకో సెల్ అధికారులు యశ్‌కు నోటీసులు ఇచ్చారట.
సినిమా టీజర్ చూస్తే… లాస్ట్‌లో యశ్ మిషన్ గన్‌తో కార్లను పేల్చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ లాస్ట్‌లో వేడెక్కిన గన్ మీద టచ్ చేసి సిగరెట్‌ను వెలిగిస్తాడు యశ్. ఆ సీన్‌కే కాషన్ క్యాప్షన్ పడలేదు. సినిమా అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా ఈ నిబంధన తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. చిత్ర బృందం చేసిన పొరపాటో, నిర్లక్ష్యమో కానీ ఇప్పుడు యశ్ నోటీసులు అందుకున్నాడు. దీనిపై యశ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.