ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mamootty) ఆరోగ్యం గురించి మరో ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohanlal) ఇటీవల శబరిమల వెళ్లి ప్రార్థించారు అని ఓ వార్త వచ్చింది మీరు చదివే ఉంటారు. ఎందుకు ప్రార్థించారు, ఏమైంది అనే వివరాలు కూడా మీకు తెలిసే ఉంటాయి. అయితే కొంతమంది ఈ విషయంలో లేనిపోని చర్చలు లేవనెత్తారు. మోహన్‌లాల్ చేసింది సరికాదు అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయమంలో లాలెటన్ స్పందించారు. శబరిమల దేవస్థానంలోని అన్యమతస్థులను అనుమతించే విషయంలో షరతులపై చాలా ఏళ్లుగా వివాదాలున్నాయి.
క్రైస్తవుడు అయిన ప్రముఖ గాయకుడు ఏసుదాసు శబరిమలకు రావాలనుకున్నపుడు ఆయన్ని అడ్డుకోవడంపై పెద్ద వివాదమే జరిగింది. అయ్యప్ప స్వామి మీద ఆయన అనేక పాటలూ పాడారు. అయినా ఆయన దేవాలయంలోకి వెళ్లడానికి అప్పట్లో వ్యతిరేకత వచ్చింది. అయితే చివరికి ఆయన ఆలయానికి వెళ్లారు. ఇటీవల మోహన్‌లాల్ శబరికి వెళ్లి అన్యమతస్థుడైన మరో ప్రముఖుడి కోసం పూజలు చేయడం మీద కాంట్రవర్శీ వచ్చింది. పూజ జరిగింది మలయాళ నటుడు మమ్ముట్టి కోసం కాగా..
పూజ చేయించింది ఆయన మిత్రుడు మరో లెజెండరీ నటుడు మోహన్ లాల్. ఇటీవల మమ్ముట్టి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు క్యాన్సర్ అని ప్రచారం జరిగింది. అదే సమయంలో మోహన్ లాల్ శబరిమలకు వెళ్లి ప్రత్యేకంగా పూజ చేయించారు. నా స్నేహితుడి పేరు మీద పూజ చేయించడం నా వ్యక్తిగతమైన విషయం. అయినా అతని కోసం ప్రార్థించడంలో తప్పేంటి? ఈ విషయంలో ఎవరి జోక్యమూ అక్కర్లేదు అని క్లారిటీ ఇచ్చారు లాలెటన్.
అంతేకాదు ఆలయానికి చెందిన వారే ఈ పూజకు సంబంధించిన వివరాల్ని బయట పెట్టి ఉండొచ్చు అని కూడా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆలయ బోర్డు సభ్యులు స్పందించారు మోహన్‌లాల్ అపార్థం చేసుకున్నారు. టికెట్‌కు సంబంధించిన వివరాల్ని మేము బయటపెట్టలేదు అని తెలిపారు. దీంతో ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.