ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal) ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏం జరిగింది, ఏమైంది అనే విషయాలు అయితే చెప్పలేదు కానీ.. 16వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరినట్లు మాత్రం ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు, హెల్త్ అప్‌డేట్ బయటకు వచ్చాయి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగొద్దని మోహన్‌లాల్‌కి వైద్యులు సూచించారు. ఇంతకీ ఏమైందంటే? మోహన్‌లాల్ తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
Mohanlal
ఆ వార్త ఎలా తెలిసిందో.. ఇప్పుడు ఆయన హెల్త్ అప్‌డేట్ కూడా అలానే బయటకు వచ్చింది. ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటన అంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులోని వివరాలు గమనిస్తే.. మోహన్‌లాల్ హై గ్రేడ్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకింది. మోహన్‌లాల్‌కు ఐదు రోజులు విశ్రాంతి అవసరమని, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మోహన్‌లాల్ ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు, ఇండస్ట్రీ జనలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో ‘ఎల్ 2: ఎంపురన్’ చేస్తున్నారు. గతంలో వచ్చిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. మరోవైపు మోహన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘బరోజ్’ కూడా రెడీగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాల పనుల కోసమే మోహన్‌లాల్ గుజరాత్ వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని సమాచారం. దీంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారట.అయితే, ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం గురించి ఎందుకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు అనేది తెలియడం లేదు. బయటకు వచ్చాక ఏమైనా దీని గురించి చెబుతారేమో చూడాలి. అప్పటివరకు ఈ విషయంలో వచ్చేవన్నీ ఊహాగానాలే.