Mohanlal: ‘అమ్మ’కు మోహన్‌ లాల్‌ అండ్‌ టీమ్‌ రాజీనామా.. ఏం జరుగుతోంది?

  • August 28, 2024 / 05:06 PM IST

మలయాళ సినిమా పరిశ్రమలో ఏం జరుగుతోంది? గత కొన్ని రోజులుగా ఈ విషయం గురించే మొత్తం ఇండియన్‌ సినిమాలో, సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ నడుస్తూనే ఉంది. అక్కడ మహిళా నటులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో పరిశ్రమలో కొంతమంది నటులపై విమర్శలు వచ్చాయి. అది ఇతర పరిశ్రమలకు కూడా పాకింది అనుకోండి. ఈ రిపోర్టు, విమర్శల నేపథ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) మొత్తం బాడీ రాజీనామా చేసింది.

Mohanlal

అధ్యక్ష పదవికి స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal ) రాజీనామా చేశారు. ఆయనతోపాటు మొత్తం 16 మంది టీమ్‌ కూడా రాజీనామాలు చేశారు. మలయాళ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్‌ కౌచ్ గురించి జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికను దృష్టిలో ఉంచుకొని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్శకుడు రంజిత్ (Ranjith Balakrishnan), నటులు సిద్ధిఖీ (Siddique) , బాబూరాజ్‌ తదితర ‘అమ్మ’ టీమ్‌ సభ్యులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

కమిటీలోని కొంతమందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా రాజీనామా చేశాం అని ప్రకటనలో కమిటీ పేర్కొంది. మరో రెండు నెలల్లో కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు కూడా తెలిపారు. జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికను దృష్టిలో ఉంచుకొని దర్శకులు, నటులపై వచ్చిన ఆరోపణల విషయంలో దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది.

ఈ నేపథ్యంలో ‘అమ్మ’ కమిటీ దిగిపోవడం గమనార్హం. అయితే కొత్త అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఉంటే బాగుంటుంది మలయాళ సినిమా పరిశ్రమలో, సోషల్‌ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే.. మలయాళ పరిశ్రమలో జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు పెద్ద కుదుపే తీసుకొచ్చింది. అలాగే ఇదే తరహా రిపోర్టులు మిగతా సినిమా పరిశ్రమల్లోనూ వస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది.

రెండుసార్లు వచ్చారు అలరించారు.. మూడోసారి మెప్పిస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus