చాలా మంది హీరోలకు మెగా ఫోన్ పట్టుకొని సినిమా తీయాలని ఉంటుంది. కానీ సినిమా డైరెక్ట్ చేయడమనేది చిన్న విషయం కాదు. అన్ని క్రాఫ్ట్స్ లో నాలెడ్జ్ ఉండాలి. అందుకే త్వరగా ఎవరూ సాహసించరు. నటులుగా స్టార్ హోదా అనుభవించే వాళ్లు డైరెక్షన్ కి దూరంగానే ఉంటారు. కానీ మోహన్ లాల్ మాత్రం రిస్క్ తీసుకొని దర్శకుడిగా సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. చాలా రోజులుగా మోహన్ లాల్ ‘బరోజ్’ అనే సినిమాతో దర్శకుడిగా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా లాంఛనంగా మొదలుపెట్టాడు మోహన్ లాల్. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు. వాస్కోడిగామా దగ్గర నిధి పరిరక్షకుడిగా ఉన్న బరోజ్ అనే చరిత్రకారుడి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బరోజ్ పాత్ర చేయబోతుంది మోహన్ లాల్ కావడం విశేషం. కేరళ-పోర్చుగల్ నేపథ్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కథ నడుస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా గ్రాండ్ గా ఉండేలా చూస్తుకుంటున్నారు.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాను త్రీడీలో తీయబోతున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లను పెద్ద పెద్ద దర్శకులే డీల్ చేయడానికి భయపడతారు. అలాంటిది దర్శకుడిగా తొలి సినిమాకే ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను ఎంపిక చేసుకున్నాడు మోహన్ లాల్. మరి ఈ సినిమా దర్శకుడిగా మోహన్ లాల్ కి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి!