ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ డేట్ మారితే చాలా సినిమాల డేట్స్ మారుతాయి అని అంటారు. ఈ విషయం మనం మొన్నీమధ్యే మాట్లాడుకున్నాం కూడా. ‘దేవర’ సినిమా గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆ మాటలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా దాదాపు ఖాయం అంటున్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఆ సినిమా తొలి భాగం ‘దేవర 1’ ఏప్రిల్ 5కు వచ్చే అవకాశం కష్టమే అని అంటున్నారు.
‘దేవర’ వాయిదాకి చాలా కారణాలున్నాయి. అయితే అవి తర్వాత చూద్దాం. ముందు ఆ మార్పు వల్ల రిలీజ్ డేట్స్ మార్చుకుంటాయి అని వార్తలొస్తున్న సినిమాల సంగతి ఇప్పుడు చూద్దాం. ‘దేవర’ విషయంలో క్లారిటీ వచ్చాక సమ్మర్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మార్పులు జరుగుతాయి అంటున్నారు. రకరకాల తేదీలు అనుకుంటూ ఫైనల్ కాకుండా ఉన్న విజయ్ దేవరకొండ – పరశురామ్ – మృణాల్ ఠాకూర్ ‘ఫ్యామిలీ స్టార్’, సిద్ధు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్‘టిల్లు స్క్వేర్’, రామ్ – పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ డేట్స్ మారుతాయట.
అయితే వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా ముందుకు వస్తాయి అని టాక్. శంకర్ – కమల్ హాసన్‌ల ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు 2’ను కాస్త ముందుకు జరిపి ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 5కి తీసుకొస్తున్నారట. ఎందుకంటే లాంగ్ వీకెండ్ అనేది ఆన్సర్ అవుతోంది. మరి వీటిలో ఏ సినిమా ముందుకు వస్తుంది అనేది ‘దేవర’ విషయంలో క్లారిటీ వచ్చాకే వస్తుంది.
ఇక ‘దేవర’ (Devara) ఆలస్యానికి కారణాలు చూస్తే… ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 5కు అటు ఇటుగా ఉండవచ్చని అంటున్నారు. ఎన్నికల సమయంలో సినిమా అంటే వసూళ్ల ఇబ్బందులు ఉంటాయి అనుకోవడం ఓ కారణం. అలాగే సైఫ్ అలీ ఖాన్ సర్జరీ మరో కారణమైతే.. సంగీత దర్శకుడు అనిరుధ్ కంటెంట్ ఇవ్వడంలో ఆలస్యం మరో కారణం అంటున్నారు. అలాగే కావల్సినంత టైమ్ తీసుకొని బెస్ట్ ప్రొడెక్ట్ ఇవ్వమని కొరటాలకు ఎన్టీఆర్ సూచించారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ అన్ని కారణాల వల్ల సినిమా అనుకున్న డేట్‌కు రాదు అంటున్నారు.